వాణిజ్య వివాదాలకు చెక్‌? ఆసియా అప్‌!

వాణిజ్య వివాదాలకు చెక్‌? ఆసియా అప్‌!

ఇటీవల వేడెక్కిన వాణిజ్య వివాదాలను పరిష్కరించుకునేందుకు వీలుగా చైనా నుంచి ప్రతినిధుల బృందం అమెరికాను సందర్శించనుండటంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య ఇటీవల దిగుమతి టారిఫ్‌ల పెంపు కారణంగా వాణిజ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటూ వచ్చాయి. దీనికితోడు టర్కీలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, వర్ధమాన దేశాల కరెన్సీల పతనం.. వంటి అంశాలు కొద్ది రోజులుగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచుతూ వచ్చాయి. కాగా.. వాణిజ్య వివాదాలకు చెక్‌ పెట్టే బాటలో వచ్చే వారం చర్చలు నిర్వహించేందుకు అమెరికా, చైనా అంగీకరించినట్లు వార్తలు వెలువడటంతో గురువారం యూరప్‌, అమెరికా మార్కెట్లు లాభపడ్డాయి. ప్రస్తుతం ఆసియలోనూ సానుకూల ధోరణి కనిపిస్తోంది. 

లాభాల్లో
ప్రస్తుతం ఆసియా మార్కెట్లన్నీ లాభాలతో కదులుతున్నాయి. సింగపూర్‌, థాయ్‌లాండ్‌, జపాన్‌, హాంకాంగ్‌, తైవాన్‌, దక్షిణ కొరియా 0.5-0.3 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో చైనా నామమాత్ర లాభంతో కదులుతోంది. ఇండొనేసియా మార్కెట్‌కు సెలవు. 

లైరా, యువాన్‌ గెయిన్‌
తాజాగా డాలరుతో మారకంలో టర్కీ కరెన్సీ లైరా భారీగా పుంజుకుంది! సోమవారం చరిత్రాత్మక కనిష్టం 7.24ను తాకిన లైరా నాలుగు రోజుల్లోనే 25 శాతం పుంజుకుని 5.81కు చేరడం విశేషం! టర్కీలో 15 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ఖతారీ ప్లెడ్జ్‌ ప్రకటించడమే దీనికి కారణంగా ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. ఇక అమెరికా, చైనా మధ్య చర్చల వార్తలతో చైనీస్‌ యువాన్‌ సైతం 1.2 శాతం జంప్‌చేసింది. డాలరుతో మారకంలో 6.86కు చేరింది. బుధవారం 6.95 వద్ద 19 నెలల కనిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. అయితే టర్కీ ఆర్థిక సంక్షోభం కారణంగా యూరో 1.137 వద్ద కదులుతోంది. ఇది దాదాపు 14 నెలల కనిష్టంకాగా.. యూరోపియన్‌ బ్యాంకులు టర్కీలో పెట్టుబడులు కలిగి ఉండటం ప్రభావాన్ని చూపుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇక జపనీస్‌ యెన్‌ మాత్రం నిలకడగా 110.97 వద్ద ట్రేడవుతోంది.  Most Popular