చైనాతో చర్చలు- వాల్‌మార్ట్‌ హైజంప్‌!

చైనాతో చర్చలు- వాల్‌మార్ట్‌ హైజంప్‌!

ఇటీవల వేడెక్కిన వాణిజ్య వివాదాలను పరిష్కరించుకునేందుకు వీలుగా చైనా నుంచి ప్రతినిధుల బృందం అమెరికా సందర్శించనుండటంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య ఇటీవల దిగుమతి టారిఫ్‌ల పెంపు కారణంగా వాణిజ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటూ వచ్చాయి. దీనికితోడు టర్కీలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం.. ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేయడంతో బుధవారం అంతర్జాతీయ స్థాయిలో స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. అయితే అమెరికా, చైనా మధ్య చర్చలకు తెరలేవనుండటంతో గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో డోజోన్స్‌ 396 పాయింట్లు(1.58 శాతం) జంప్‌చేసి 25,556 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 22 పాయింట్లు(0.8 శాతం) ఎగసి 2,841 వద్ద స్థిరపడింది. ఇక నాస్‌డాక్‌ సైతం 32 పాయింట్ల(0.45 శాతం) పుంజుకుని 7,806 వద్ద నిలిచింది. 

జేసీ పెన్నీ పతనం
దశాబ్ద కాలంలోలేని విధంగా అమ్మకాలు పుంజుకోవడంతో అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించిన గ్లోబల్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ షేరు ఏకంగా 9.3 శాతం దూసుకెళ్లింది. చైనాతో అమెరికా ప్రభుత్వం చర్చలపై అంచనాల కారణంగా బోయింగ్‌ 4.3 శాతం, కేటర్‌పిల్లర్‌ 3.2 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఈ బాటలో ఆకర్షణీయ ఫలితాలతో సిస్కో సిస్టమ్స్‌ 3 శాతం ఎగసింది. కాగా.. ఐదు రోజులుగా పతనబాటలో సాగుతున్న సైమాంటిక్‌ కార్ప్‌ దాదాపు 5 శాతం జంప్‌చేసింది. హెడ్జ్‌ ఫండ్‌ స్టార్‌బోర్డ్‌ వేల్యూ కంపెనీలో 5.8 శాతం వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడికావడం ఇందుకు దోహదపడింది. కాగా.. నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతోపాటు గైడెన్స్‌ నిరాశపరచడంతో జేసీ పెన్నీ ఏకంగా 27 శాతం కుప్పకూలింది. Most Popular