69.89 వద్ద ముగిసిన రూపాయి!

69.89 వద్ద ముగిసిన రూపాయి!

టర్కీ కరెన్సీ లైరా కుప్పకూలడంతో సోమవారం సరికొత్త కనిష్టానికి చేరిన దేశీ కరెన్సీ మంగళవారం మరోసారి చతికిలపడింది. డాలరుతో మారకంలో చరిత్రలో తొలిసారి 70 మార్క్‌ దిగువకు చేరింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఒక దశలో 17 పైసలు(0.25 శాతం) బలహీనపడింది. 70.08ను తాకింది. ఇది చరిత్రాత్మక కనిష్టంకాగా.. చివరికి కాస్త బలాన్ని పుంజుకుంది. సోమవారం ముగింపుతో పోలిస్తే 2 పైసలు బలపడి 69.89 వద్ద నిలిచింది. కాగా.. మంగళవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు పుంజుకోవడంతో రూపాయి ఇంట్రాడేలో 14 పైసలు(0.22 శాతం) బలపడింది. డాలరుతో మారకంలో  69.77 వద్ద గరిష్టాన్ని తాకింది. వెనువెంటనే ఒత్తిడికి లోనై 70.08 వద్ద చరిత్రాత్మక కనిష్టాన్ని చవిచూసింది. 

టర్కీ ఎఫెక్ట్‌
ఆర్థిక లోటు పెరగడం, టర్కీ ప్రెసిడెంట్‌ టయ్యిప్‌ ఎర్డోగన్‌ ఆర్థిక వ్యవస్థపై నియంత్రణలు పెంచడం, అమెరికాతో దౌత్యపరమైన వ్యతిరేకతలు ఏర్పడటం వంటి పలు ప్రతికూల అంశాల కారణంగా టర్కీ ఆర్థిక సంక్షోభంవైపు అడుగులేస్తోంది. దీంతో దేశ కరెన్సీ లైరా మారకపు విలువ ఇటీవల పతనబాటలో సాగుతూ వస్తోంది. గత వారం  స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌లను రెట్టింపునకు పెంచుతూ అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోమవారం ఉన్నట్టుండి టర్కీ కరెన్సీ లైరా మారకపు విలువ 10 శాతం కుప్పకూలింది. ఒక దశలో చరిత్రాత్మక కనిష్టం 7.24ను తాకింది. టర్కీ కరెన్సీ లైరా చరిత్రాత్మక కనిష్టానికి చేరడంతో ఈ ప్రభావం ఇతర కరెన్సీలనూ దెబ్బకొట్టింది. ఈ బాటలో రూపాయికి సైతం షాక్‌తగిలింది. 

కరెన్సీల పతనం
టర్కీ ఆర్థిక సంక్షోభం లైరాతోపాటు వర్ధమాన దేశాల కరెన్సీలపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 96ను అధిగమించగా.. జపనీస్‌ యెన్‌ మినహా పలు కరెన్సీలు పతనబాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ లైరా మారకపు విలువ అత్యంత అధికంగా 50 శాతం పడిపోయింది. ఇదే సమయంలో రూపాయి  9 శాతం నీరసించగా.. రష్యన్‌ రూబుల్‌ 15 శాతం దిగజారింది. ఈ బాటలో ఫిలిప్పీన్స్‌ పెసో , ఇండొనేసియన్‌ రుపయా 7.5 శాతం, దక్షిణాప్రికన్‌ ర్యాండ్‌ 15 శాతం, బ్రెజిలియన్‌ రియల్‌ 17 శాతం చొప్పున పతనమయ్యాయి.!Most Popular