వహ్వా.. ఏమీ నీ రాజసం.. టీసీఎస్‌!!

వహ్వా.. ఏమీ నీ రాజసం.. టీసీఎస్‌!!

ఓవైపు ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్న రికార్డును దేశ ఆర్థిక వ్యవస్థ సొంతం చేసుకోగా... మరోవైపు సాప్ట్‌వేర్‌ సేవలతో అంతర్జాతీయ స్థాయిలో భారీ అడుగులేస్తున్న టాటా గ్రూప్‌ దిగ్గజం టీసీఎస్ మరో గొప్ప ఘనతను అందుకుంది. సాఫ్ట్‌వేర్‌ సేవల రంగంలో ప్రపంచంలోని అతి విలువైన కంపెనీలలో రెండో ర్యాంకును కైవసం చేసుకుంది. తద్వారా అమెరికన్‌ దిగ్గజం ఐబీఎం తదుపరి స్థానంలో సగర్వంగా నిలిచింది. ఈ రేసులో తాజాగా యాక్సెంచర్‌ను వెనక్కినెట్టింది. ఆ వివలేమిటో చూద్దామా....?
   
100 బిలియన్‌ డాలర్ల కంపెనీ
మార్కెట్‌ కేపిటలైజేషన్‌(విలువ)రీత్యా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ప్రస్తుతం 109 బిలియన్‌ డాలర్ల కంపెనీగా ఎదిగింది. అమెరికా స్టాక్‌ ఎక్స్చేంజీలలో లిస్టయిన ఐబీఎం మార్కెట్‌ విలువ 133 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే టీసీఎస్‌ విలువకంటే 20 శాతమే అధికం. లిస్టెడ్‌ కంపెనీల విలువను కంపెనీ ఈక్విటీ, మార్కెట్‌ ధర ఆధారంగా మదింపు చేసే సంగతి తెలిసిందే. దీనిని ఇన్వెస్టర్ల సంపదగా కూడా పేర్కొంటుంటారు. ఈ ఏడాది టీసీఎస్‌ మార్కెట్‌ విలువ ఏకంగా 36 శాతం పెరిగింది. ఇదే కాలంలో ఐబీఎం మార్కెట్‌ విలువ 6 శాతం నీరసించింది.
నికర లాభాల్లోనూ
నికర లాభాల్లోనూ ఐబీఎం తదుపరి ర్యాంకును టీసీఎస్‌ సొంతం చేసుకుంది. తద్వారా యాక్సెంచర్‌ను వెనక్కి నెట్టివేసింది. ఈ జూన్‌తో ముగిసిన ఏడాది కాలాన్ని పరిగణిస్తే టీసీఎస్‌ నికర లాభం 4.2 బిలియన్‌ డాలర్లు. ఇదే కాలంలో యాక్సెంచర్‌ 3.9 బిలియన్‌ డాలర్లే ఆర్జించింది. ఇక 5.8 బిలియన్‌ డాలర్ల లాభంతో ఐబీఎం టాప్‌ ర్యాంకులో నిలుస్తోంది. కాగా..  ఆదాయ రీత్యా టీసీఎస్‌ నాలుగో స్థానంలో ఉంది. ఐబీఎం ఆదాయం దాదాపు 81 బిలియన్‌ డాలర్లుకాగా.. యాక్సెంచంర్‌ 40.6 బిలియన్‌ డాలర్లు, డీఎక్స్‌సీ టెక్నాలజీస్‌ 24.6 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని పొందాయి. ఇదే కాలంలో టీసీఎస్‌ ఆదాయం 19.7 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అయితే ఉత్తర అమెరికా, యూరోపియన్‌ దేశాల సాఫ్ట్‌వేర్‌ సేవల కంపెనీలకంటే టీసీఎస్ నిర్వహణ లాభం, మార్జిన్లు ఎంతో మెరుగ్గా ఉండటంతో నికర లాభాల్లో ముందంజలో ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 
4 లక్షల మంది
టీసీఎస్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది సేవలందిస్తుండటం విశేషం! తద్వారా కంపెనీ ప్రపంచంలోనే ఉపాధి కల్పనలో మేటి సంస్థలలో ఒకటిగా కితాబును పొందుతోంది. యాక్సెంచర్‌ 4.25 లక్షల మంది సిబ్బందిని కలిగి ఉండగా.. ఐబీఎంలో దాదాపు 4 లక్షల మంది పనిచేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. Most Popular