వచ్చే వారం మార్కెట్ల దారెటు?!

వచ్చే వారం మార్కెట్ల దారెటు?!

వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు విభిన్న అంశాల ఆధారంగా ప్రభావితమయ్యే అవకాశముంది. ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. బుధవారం(15న) ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా స్టాక్‌ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) తొలి త్రైమాసిక ఫలితాల సీజన్‌ దాదాపు ముగియనుండటంతో ఆర్థిక గణాంకాలు, విదేశీ సంకేతాలవైపు ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నారు. కాగా.. నేడు ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ), కోల్‌ ఇండియా, ఎన్‌బీసీసీ క్యూ1(ఏప్రిల్‌-జూన్‌) ఫలితాలు ప్రకటించనున్నాయి. సోమవారం(13న) ఆయిల్‌ ఇండియా పనితీరు వెల్లడించనుంది. ఇదేవిధంగా 14న ఇండియాబుల్స్‌ రియల్టీ ఫలితాలు తెలియనున్నాయి. దీంతో సోమవారం క్యూ1 ఫలితాల ఆధారంగా ప్రభుత్వ రంగ దిగ్గజ కౌంటర్లు ట్రేడయ్యే అవకాశముంది. 
గణాంకాలవైపు చూపు
కేంద్ర గణాంకాల శాఖ శుక్రవారం(10న) మార్కెట్లు ముగిశాక జూన్‌ నెలకు పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్‌(ఐఐపీ) వివరాలు ప్రకటించింది. జూన్‌లో ఐఐపీ గత ఐదు నెలల్లోనే అత్యధికంగా 7 శాతం జంప్‌చేసింది. జీఎస్‌టీ అమలు నేపథ్యంలో గతేడాది జూన్‌లో ఐఐపీ మందగించిందని.. దీంతో అధిక వృద్ధికి వీలుకలిగిందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఈ ఏడాది మే నెలలో ఐఐపీ 3.2 శాతం పుంజుకున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో  మంగళవారం జులై నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలను విడుదల చేయనుంది. జూన్‌ నెలలో డబ్ల్యూపీఐ ఏకంగా 5.77 శాతం ఎగసింది.  
విదేశీ సంకేతాలు
జులై నెలకు యూఎస్‌ రిటైల్‌ అమ్మకాల గణాంకాలు 15న విడుదలకానున్నాయి. జూన్‌లో నెలవారీ ప్రాతిపదికన రిటైల్‌ సేల్స్‌ 0.5 శాతం పుంజుకున్నాయి. ఇక జులై నెలకు జపాన్‌ వాణిజ్య గణాంకాలు 16న వెల్లడికానున్నాయి. జూన్‌లో జపాన్‌ వాణిజ్య మిగులు 66.5 శాతానికి పెరిగింది. విలువరీత్యా 721 బిలియన్‌ జపనీస్‌ యెన్‌లను అధిగమించింది.
ఇతర అంశాలూ కీలకమే
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, ఎఫ్‌పీఐలు, దేశీ ఫండ్స్‌ పెట్టుబడులు, అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు వంటి పలు ఇతర అంశాలు సైతం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రభావితం చేయగలవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికితోడు ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకుంటూ వస్తున్నాయి. దీంతో కొంతమేర ఇండెక్సులు కరెక్షన్‌కు లోనుకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 10,500 స్థాయికి చేరడంతో 10,200 వరకూ వెనకడుగు వేసే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. Most Popular