లాభాలకు బ్రేక్, డ్రాగ్ చేసిన బ్యాంక్ స్టాక్స్

లాభాలకు బ్రేక్, డ్రాగ్ చేసిన బ్యాంక్ స్టాక్స్

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల ప్రభావంతో.. ఇవాల్టి ట్రేడింగ్‌లో మన మార్కెట్లు నష్టాలను నమోదు చేసుకున్నాయి. ప్రధాన ఇండెక్స్ షేర్లు నష్టాలతో ముగిశాయి. 

ఐరోపా మార్కెట్లు కూడా నెగిటివ్‌గానే ఓపెన్ కావడంతో మన మార్కెట్లు కోలుకోవడం సాధ్య పడలేదు. ఇక మిడ్ సెషన్ తర్వాత వెల్లడైన ఎస్‌బీఐ ఆర్థిక ఫలితాలు.. బ్యాంక్ నిఫ్టీతో పాటు.. బెంచ్ మార్క్ ఇండెక్స్‌లను కూడా డ్రాగ్ చేశాయి.

రూ. 4876 కోట్ల నష్టాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించడంతో.. ఈ షేర్ ధర గరిష్ట స్థాయి నుంచి 6 శాతం మేర తగ్గిపోయింది. దీంతో బ్యాంక్ నిఫ్టీ అరశాతం పైగా నష్టాల్లోకి జారుకోగా.. అప్పటికే ప్రతికూలంగా ఉన్న సెన్సెక్స్, నిఫ్టీలకు నష్టాలు మరింతగా పెరిగాయి.

ఇవాల్టి ట్రేడింగ్‌లో 155 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 37,869 వద్ద ముగిసింది. 41 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ 11,429 వద్ద క్లోజయింది. బ్యాంక్ నిఫ్టీ  0.69 శాతం మేర క్షీణించి 28124 వద్ద ట్రేడింగ్ ముగించుకుంది.

స్మాల్‌క్యాప్, మిడ్ క్యాప్ షేర్లకు కూడా ఇవాల్టి ట్రేడింగ్‌లో నష్టాలు తప్పలేదు. రూపాయి మారకం పతనం కావడం.. డాలర్ పుంజుకోవడం కూడా మన మార్కెట్లను ప్రభావితం చేసింది.

ఐటీ, టెక్నాలజీ ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్ సెక్టార్లు మాత్రమే సానుకూలంగా ముగియగా.. మెటల్స్ రంగం 2 శాతం పైగా పతనమైంది. ఆ తర్వాత హెల్త్ కేర్ సెక్టార్ అత్యధికంగా నష్టాలను నమోదు చేసుకుంది. 

నిఫ్టీలో ఐషర్ మోటార్స్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం, ఎం అండ్ ఎం, హీరో మోటోకార్ప్ టాప్ గెయినర్స్‌గా నిలవగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడియా సెల్యులార్, వేదాంత, సన్ ఫార్మా, టాటా మోటార్స్ షేర్లు టాప్ లూజర్స్‌గా నిలిచాయి.Most Popular