38000 దాటిన సెన్సెక్స్‌- నిఫ్టీ రికార్డ్‌!

38000 దాటిన సెన్సెక్స్‌- నిఫ్టీ రికార్డ్‌!

మార్కెట్‌ చరిత్రలో తొలిసారి సెన్సెక్స్‌ 38,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. అంతేకాకుండా 137 పాయింట్లు లాభపడటం ద్వారా మ్యాజిక్‌ మార్క్‌కు ఎగువన 38,024 వద్ద ముగిసింది. నిఫ్టీ 21 పాయింట్లు పుంజుకుని 11,471 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 11,495 వరకూ ఎగసింది. ఇక బ్యాంక్‌ నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 28,363 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. 
ప్రభుత్వ బ్యాంక్స్‌ హవా
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ 3 శాతం జంప్‌చేయగా.. రియల్టీ 2 శాతం, మెటల్‌ 1.4 శాతం చొప్పున ఎగశాయి. అయితే ఫార్మా 0.65 శాతం వెనకడుగు వేసింది. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హిందాల్కో, ఎస్‌బీఐ, వేదాంతా, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌ 4.2-1.2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఎయిర్‌టెల్‌ దాదాపు 5 శాతం పతనంకాగా.. టైటన్‌, ఓఎన్‌జీసీ, సిప్లా, ఐబీ హౌసింగ్‌, జీ, గ్రాసిమ్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, హీరోమోటో 2.2-1 శాతం మధ్య డీలాపడ్డాయి.
చిన్న షేర్లు ఓకే
మార్కెట్ల బాటలో చిన్న షేర్లూ లాభపడ్డాయి. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.6 శాతం పుంజుకోగా.. స్మాల్‌ క్యాప్‌ 0.3 శాతం బలపడింది. బీఎస్‌ఈలో ట్రేడైన మొత్తం షేర్లలో 1360 లాభపడగా.. 1335 నష్టాలతో ముగిశాయి.
ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 569 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) కేవలం రూ. 30 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. మంగళవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 315 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌ రూ. 320 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే! Most Popular