బంధన్‌ బ్యాంక్‌, వెంకీస్‌ ఇండియా జూమ్‌

బంధన్‌ బ్యాంక్‌, వెంకీస్‌ ఇండియా జూమ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు విడుదల చేసిన వెంకీస్‌ ఇండియాతోపాటు ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న బంధన్‌ బ్యాంక్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో ట్రేడవుతున్నాయి. 

బంధన్‌ బ్యాంక్‌ 
గత కొంతకాలంగా ర్యాలీ బాటలో సాగుతున్న బంధన్‌ బ్యాంక్‌ కౌంటర్‌ జులై 18న ఆర్థిక ఫలితాలు ప్రకటించాక మరింత జోరందుకుంది. ఈ కాలంలో బంధన్‌ బ్యాంక్‌ షేరు 35 శాతం లాభపడింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడమే దీనికి కారణంకాగా.. నికర లాభం 47 శాతం జంప్‌చేసి రూ. 482 కోట్లను అధిగమించింది. నికర వడ్డీ ఆదాయం సైతం 40 శాతం పెరిగి రూ. 1037 కోట్లను తాకింది. అయితే స్థూల మొండిబకాయిలు 1.25 శాతం నుంచి 1.26 శాతానికి చేరగా.. నికర ఎన్‌పీఏలు 0.58 శాతం నుంచి 0.64 శాతానికి పెరిగాయి. కాగా ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో బంధన్‌ బ్యాంక్‌ షేరు 5.4 శాతం జంప్‌చేసి రూ. 730 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 742 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. 

వెంకీస్‌ ఇండియా
ఎఫ్‌ఎంసీజీ సంస్థ వెంకీస్‌ ఇండియా ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. నికర లాభం 36 శాతం జంప్‌చేసి రూ. 71 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 14 శాతం పెరిగి రూ. 746 కోట్లను తాకింది. ఏఎస్‌ఎం జాబితా నుంచి స్టాక్‌ ఎక్స్ఛేంజీలు తప్పించడంతో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న వెంకీస్‌ ఇండియా ఫలితాల నేపథ్యంలో మరోసారి జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 3125 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 3287 వద్ద గరిష్టాన్ని, రూ. 3040 వద్ద కనిష్టాన్నీ తాకింది.Most Popular