పేజ్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌టీ మీడియా హైజంప్‌

పేజ్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌టీ మీడియా హైజంప్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) తొలి త్రైమాసిక  ఫలితాలు విడుదల చేసిన పేజ్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడగా.., ఎఫ్‌ఎం రేడియో బిజినెస్‌ను విడదీయనున్న హెచ్‌టీ మీడియా  కౌంటర్‌సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో ట్రేడవుతున్నాయి. 

పేజ్‌ ఇండస్ట్రీస్‌ జూమ్‌
జాకీ బ్రాండ్‌ దుస్తుల దిగ్గజం పేజ్‌ ఇండస్ట్రీస్‌ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. నికర లాభం 46 శాతం జంప్‌చేసి రూ. 124 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం పెరిగి రూ. 815 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 39 శాతం పుంజుకుని రూ. 189 కోట్లకు చేరగా.. ఇబిటా మార్జిన్లు 3.6 శాతం ఎగసి 23.2 శాతానికి చేరాయి. 
రూ. 41 డివిడెండ్‌
వాటాదారులకు షేరుకి రూ. 41 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను పేజ్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో పేజ్‌ ఇండస్ట్రీస్‌ షేరు 6 శాతంపైగా జంప్‌చేసి రూ. 32,050 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 32,180 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది.

హెచ్‌టీ మీడియా ఇలా
ఎఫ్‌ఎం రేడియో బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు నిర్ణయించినట్లు హెచ్‌టీ మీడియా వెల్లడించింది. అయితే ఉత్తరప్రదేశ్‌, హైదరాబాద్‌లలో నిర్వహిస్తున్న ఎఫ్‌ఎం రేడియో బిజినెస్‌మినహా.. మిగిలిన విభాగాన్ని ప్రత్యేక సంస్థగా విడదీయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హెచ్‌టీ మీడియా షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.25 శాతం పెరిగి రూ. 58 సమీపంలో ట్రేడవుతోంది. తొలుత 7 శాతం పురోగమించి రూ. 61ను అధిగమించింది.Most Popular