యూరప్‌ మార్కెట్లు వీక్‌- ఆసియా అటూఇటూ!

యూరప్‌ మార్కెట్లు వీక్‌- ఆసియా అటూఇటూ!

అమెరికా, చైనా మధ్య దిగుమతి సుంకాల విధింపు ద్వారా వాణిజ్య యుద్ధానికి తెరలేవడంతో యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. మరోపక్క రష్యాపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించనున్న వార్తలతో ఆ దేశ కరెన్సీ రూబుల్‌, టర్కీ కరెన్సీ లైరా బలహీనపడ్డాయి. కాగా... జర్మన్‌ ప్రభుత్వ బాండ్లకు డిమాండ్‌ పెరిగింది. రూబుల్‌ 2016 కనిష్ట స్థాయికి 66కు చేరింది. రూబుల్‌ బుధవారం 3 శాతం పతనంకాగా.. తాజాగా మరో 1 శాతం నీరసించింది.  ప్రస్తుతం ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ 0.25 శాతం, యూకే ఇండెక్స్‌ ఫుట్సీ 0.5 శాతం చొప్పున తిరోగమించగా.. జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌ నామమాత్ర నష్టంతో కదులుతోంది. 
చైనా హైజంప్‌!
దెబ్బకు దెబ్బ అన్నట్లుగా చైనా ప్రభుత్వం తాజాగా 16 బిలియన్‌ డాలర్ల విలువైన అమెరికన్‌ దిగుమతులపై 25 శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించడంతో వాణిజ్య వివాద మేఘాలు మరింత ముసురుకున్నాయి. ఇప్పటికే 200 బిలియన్‌ డాలర్ల చైనీస్‌ దిగుమతులపై తొలుత ప్రతిపాదించిన 10 శాతం టారిఫ్‌లను 25 శాతానికి పెంచేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ప్రణాళికలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవికాకుండా ఈ నెల 23 నుంచీ అదనంగా 16 బిలియన్‌ డాలర్ల విలువైన చైనీస్‌ దిగుమతులపై 25 శాతం సుంకాలను వసూలు చేయనున్నట్లు యూఎస్‌ వాణిజ్య ప్రతినిధి బృందం మంగళవారం పేర్కొంది. దీంతో చైనా తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆసియా స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. 
మార్కెట్లు ఇలా
ఆసియా మార్కెట్లలో చైనా 1.8 శాతం జంప్‌చేయగా... హాంకాంగ్‌ దాదాపు 1 శాతం ఎగసింది. ఈ బాటలో దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌ 0.1 శాతం చొప్పున పుంజుకోగా.. ఇండొనేసియా, తైవాన్‌, జపాన్‌ 0.5-0.2 శాతం మధ్య నష్టపోయాయి. సింగపూర్‌ మార్కెట్‌ సెలవులో ఉంది!Most Popular