క్యూ1-అపార్‌ ఇండస్ట్రీస్‌- ఇక్రా నేలచూపు!

క్యూ1-అపార్‌ ఇండస్ట్రీస్‌- ఇక్రా నేలచూపు!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) తొలి త్రైమాసిక  ఫలితాలు విడుదల చేసిన అపార్‌ ఇండస్ట్రీస్‌, ఇక్రా లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ రెండు కౌంటర్లూ బలహీనంగా ట్రేడవుతున్నాయి. 

అపార్‌ ఇండస్ట్రీస్‌ వీక్
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో అపార్‌ ఇండస్ట్రీస్ నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 29 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 15 శాతం పెరిగి రూ. 1496 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 14 శాతం పుంజుకుని రూ. 108 కోట్లకు చేరగా.. ఇబిటా మార్జిన్లు 7.3 శాతం వద్ద యథాతథంగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 3.4 శాతం పతనమై రూ. 584 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 573 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. 
 
ఇక్రా లిమిటెడ్‌ బైబ్యాక్‌ 
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో రేటింగ్‌ సంస్థ ఇక్రా లిమిటెడ్‌ నికర లాభం 12 శాతం పుంజుకుని రూ. 25 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 13 శాతం పెరిగి రూ. 787 కోట్లను తాకింది. కాగా.. షేరుకి రూ. 3800 ధర మించకుండా సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కి ఇక్రా లిమిటెడ్‌ బోర్టు ఆమోదించింది. బైబ్యాక్‌లో భాగంగా 2.24 లక్షల షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు ఇక్రా తెలియజేసింది. అయితే ఫలితాలు, బైబ్యాక్‌ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఇక్రా లిమిటెడ్‌ షేరు 3.2 శాతం పతనమై రూ. 3636 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 3994 వద్ద గరిష్టాన్నీ, రూ. 3555 వద్ద కనిష్టాన్ని తాకింది. Most Popular