ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌, ఫ్యూచర్ కన్జూమర్‌ డీలా!

ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌, ఫ్యూచర్ కన్జూమర్‌ డీలా!

ప్రయివేట్‌ రంగ సంస్థలు ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌, ఫ్యూచర్‌ కన్జూమర్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించాయి. దీంతో నిరాశకు లోనైన ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లలో అమ్మకాలకు దిగారు.  

ఎడిల్‌వీజ్‌ డౌన్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో ఫైనాన్షియల్‌ సేవల సంస్థ ఎడిల్‌వీజ్‌ కౌంటర్‌ అమ్మకాలతో డీలాపడింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు దాదాపు 7 శాతం పతనమై రూ. 306 దిగువన ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 318 వద్ద గరిష్టాన్నీ, రూ. 303 వద్ద కనిష్టాన్ని తాకింది.  
క్యూ1 వీక్‌
కన్సాలిడేటెడ్‌ ఫ్రాతిపదికన ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఎడిల్‌వీజ్‌ నికర లాభం 31 శాతం ఎగసి రూ. 264 కోట్లను తాకింది. అయితే బీమా రంగ బిజినెస్‌ నష్టాలు రూ. 24 కోట్ల నుంచి రూ. 46 కోట్లకు ఎగశాయి. ఇక బీఎంయూ, కార్పొరేట్‌ విభాగం సైతం రూ. 14 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం క్యూ1లో రూ. 37 కోట్ల నికర లాభం సాధించింది. కాగా.. నికర వడ్డీ ఆదాయం మాత్రం 14 శాతం పెరిగి రూ. 1325 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు 1.71 శాతం నుంచి 1.75 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.61 శాతం నుంచి 0.74 శాతానికి పెరిగాయి. 

ఫ్యూచర్‌ కన్జూమర్‌ డీలా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో ఫ్యూచర్‌ కన్జూమర్‌ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం పతనమై రూ. 47 దిగువన ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 51 వద్ద గరిష్టాన్నీ, రూ. 46 వద్ద కనిష్టాన్ని తాకింది. 
క్యూ1 వీక్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికనఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఫ్యూచర్‌ కన్జూమర్‌ లిమిటెడ్‌ రూ. 6 కోట్లమేర నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2017-18) క్యూ1లో దాదాపు రూ. 9 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 27 శాతం ఎగసి రూ. 841 కోట్లను తాకింది. నిర్వహణ లాభం సైతం రూ. 9 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పెరిగింది.