పసిడికి డాలర్‌ దెబ్బ!

పసిడికి డాలర్‌ దెబ్బ!

అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నసంకేతాలతో ఇటీవల డాలరు బలపడుతూ వస్తోంది. గడిచిన వారం(జులై 30-ఆగస్ట్‌3) ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 0.5 శాతం పుంజుకోగా... ఇదే సమయంలో పసిడి 0.8 శాతం వెనకడుగు వేసింది. అయితే  శుక్రవారం డాలరు స్వల్పంగా బలహీనపడగా.. పసిడి నామమాత్రంగా పుంజుకుంది. జులైలో అంచనాలకంటే తక్కువగా అమెరికాలో 1.57 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించడమే దీనికి కారణం! కాగా.. శుక్రవారానికల్లా డాలరు ఇండెక్స్‌ 95.16కు చేరగా.. పసిడి ఔన్స్‌ 1223 డాలర్ల వద్ద ముగిసింది. వెరసి బంగారం వరుసగా నాలుగో వారం నష్టాలతో నిలిచింది. వెండి ఔన్స్‌ 15.46 వద్ద స్థిరపడింది. గత వారం వెండి ధర 0.2 శాతమే క్షీణించింది. 
1200 డాలర్ల వద్ద సపోర్ట్‌
ఇటీవల కొద్ది రోజులుగా పసిడి ఫ్యూచర్స్‌లో అమ్మకాలు కొనసాగడంతో ఓవర్‌సోల్డ్‌ స్థాయికి చేరిందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. దీంతో స్వల్పకాలానికి 1200 డాలర్ల వద్ద పసిడికి మద్దతు లభించగలదని అంచనా వేస్తున్నారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదిరితే.. పసిడికి గిరాకీ పెరిగే వీలున్నట్లు మరోపక్క మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. 2018 ఏప్రిల్‌-జూన్‌ కాలంలో పసిడి ఈటీఎఫ్‌ల డిమాండ్‌ 1960 మెట్రిక్‌ టన్నులకు పరిమితమైనట్లు ప్రపంచ గోల్డ్‌ కౌన్సిల్‌ వెల్లడించింది. 2009 తరువాత ఇది కనిష్టమని తెలియజేసింది. ఇందుకు ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు 46 శాతం క్షీణించడమే కారణమని వివరించింది.
దేశీయంగా ఇలా
దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి అక్టోబర్‌ కాంట్రాక్ట్‌ రూ. 37 పెరిగి రూ. 29,650కు చేరగా.. వెండి కేజీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 111 బలపడి రూ. 38,052 వద్ద నిలిచింది. కాగా.. డాలరుతో మారకంలో రూపాయి 68.50కంటే దిగువకు పతనంకావడం.. ప్రభుత్వ సుంకాలు వంటి అంశాలు దేశీయంగా పసిడి ధరల క్షీణతను అడ్డుకుంటున్నట్లు బులియన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.Most Popular