ఫలితాలూ, వర్షపాతమే ఇక దిక్సూచి!

ఫలితాలూ, వర్షపాతమే ఇక దిక్సూచి!

వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు కార్పొరేట్‌ ఫలితాలు, విదేశీ పరిస్థితులే దిక్సూచిగా నిలవనున్నాయి. గడిచిన వారం పలు కేంద్ర బ్యాంకులు పరపతి నిర్ణయాలను ప్రకటించాయి. దేశీయంగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను పావు శాతం పెంచడంతో రెపో 6.5 శాతానికి చేరింది. రివర్స్‌ రెపోను సైతం 6.25 శాతానికి, బ్యాంకు రేటును 6.75 శాతానికి సర్దుబాటు చేసింది. ఇక ఫెడరల్‌ రిజర్వ్‌(అమెరికా), బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ యథాతథ పాలసీ అమలుకు కట్టుబడగా.. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ వడ్డీ రేటును 0.25 శాతం పెంచింది. దీంతో బీవోఈ వడ్డీ రేటు 0.75 శాతానికి చేరింది. కాగా.. ఇప్పటికే ఫలితాల సీజన్‌ ఊపందుకోగా వచ్చే వారం మరికొన్ని బ్లూచిప్‌ కంపెనీల పనితీరు వెల్లడికానుంది.

జాబితా ఇదీ
6న(సోమవారం) అదానీ పోర్ట్స్‌, 7న ఎంఅండ్ఎం, బీపీసీఎల్‌, 8న హెచ్‌పీసీఎల్‌, లుపిన్‌, సీమెన్స్‌ క్యూ1(ఏప్రిల్‌-జూన్‌) ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ బాటలో 9న అరబిందో ఫార్మా, ఐషర్‌ మోటార్స్‌, 10న ఎస్‌బీఐ, హిందాల్కో, గెయిల్‌ పనితీరు తెలియనుంది.

రుతుపవనాలు కీలకం
ఈ వర్షాకాల ద్వితీయార్థంలో రుతు పవనాల కదలికలపై శుక్రవారం(3న) దేశీ వాతావరణ శాఖ(ఐఎండీ) తాజా అంచనాలు వెల్లడించింది. ఆగస్ట్‌-సెప్టెంబర్‌ కాలంలో దీర్ఘకాలిక సగటుకు 95 శాతం వర్షాలు కురిసే వీలున్నట్లు పేర్కొంది. ఇకపై దేశవ్యాప్తంగా వర్షాలు విస్తరించే అంశం సెంటిమెంటును ప్రభావితం చేయగలదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇతర అంశాలకూ  ప్రాధాన్యం
ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల తీరు, వాణిజ్య వివాదాలు వంటి పలు అంశాలు సైతం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించే అవకాశమున్నట్లు నిపుణులు వివరించారు.Most Popular