యాపిల్ వాల్యూ @ రూ. 68 లక్షల కోట్లు

యాపిల్ వాల్యూ @ రూ. 68 లక్షల కోట్లు

బిలియన్ డాలర్ కంపెనీగా అవతరించడం... ఇప్పుడు కొన్ని లక్షల కంపెనీలకు లక్ష్యం. అయితే ఓ సంస్థ ఏకంగా ట్రిలియన్ డాలర్ కంపెనీగా అవతరించింది. అమెరికాలో ఈ మార్కును అందుకున్న తొలి పబ్లిక్ కంపెనీగా యాపిల్ రికార్డ్ సృష్టించింది. తాజాగా ప్రకటించిన ఏప్రిల్-జూన్ ఆర్థిక ఫలితాలు.. మార్కెట్ అంచనాలను మాత్రమే కాదు, కంపెనీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని కూడా మించి నమోదు కావడం.. స్టాక్ ర్యాలీకి కారణం అయింది. ఒక్క రోజే 65 బిలియన్ డాలర్లను తన వాల్యుయేషన్‌లో చేర్చుకున్న యాపిల్ సంస్థ.. తొలి ట్రిలియన్ డాలర్ పబ్లిక్ కంపెనీగా నమోదు అయింది.

తాజాగా ప్రకటించిన ఆర్థిక ఫలితాలు ఇచ్చిన జోష్‌తో.. గురువారం నాటి ట్రేడింగ్‌లో యాపిల్ కంపెనీ షేర్లు ర్యాలీ చేశాయి. ఒక్కో షేర్ ధర 207 డాలర్లను దాటిన సమయంలో... యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. ఇప్పటివరకూ ఈ ల్యాండ్‌మార్క్‌ను తొలి పబ్లిక్ కంపెనీ యాపిల్ మాత్రమే.

2007లో పెట్రోచైనా సంస్థ కూడా ట్రిలియన్ డాలర్ల కంపెనీగా రికార్డు సృష్టించింది. అయితే.. ఈ సంస్థలో 2శాతం వాటాను మాత్రమే పబ్లిక్‌కి రిలీజ్ చేయడంతో.. దీని వాల్యుయేషన్‌పై అనేక అనుమానాలు ఉన్నాయి. అలాగే సౌదీ అరేబియాకు చెందిన సౌదీ ఆరామ్‌కో సంస్థను 2 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాలు చేసినా... దీని వాల్యూయేషన్‌పై కూడా ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 

ఐఫోన్ ఎక్స్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవని.. వీటి తయారీని కంపెనీ నిలిపివేయనుందని.. ఈమధ్య కాలంలో అనేక విశ్లేషణలు వచ్చాయి. ఐఫోన్ ఎక్స్‌కి ఉన్న మార్కెట్‌ను అంచనా వేయడంలో అందరూ విఫలమయ్యారని.. యాపిల్ సంస్థ తాజాగా చెప్పింది. ఇప్పుడు ప్రకటించిన రిజల్ట్స్‌తో అదే నిజమని తేలింది. తాజా త్రైమాసికంలో 11.5 బిలియన్ డాలర్ల లాభాలను యాపిల్ జమ చేసుకుంది. అమ్మకాలు రికార్డు స్థాయిలో 53.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో ఒక్క రోజులోనే 935 బిలియన్ డాలర్ల నుంచి.. 1 ట్రిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో అయితే.. 68 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ స్థాయికి చేరుకుంది.

ప్రస్తుతం యాపిల్ వద్ద 285 బిలియన్ డాలర్ల నగదు నిల్వలు ఉన్నాయి. 2017 ఆర్థిక సంవత్సరంలో 48.5 బిలియన్ల లాభాలను కంపెనీ నమోదు చేసింది. 1976లో కంప్యూటర్లను విక్రయించే కంపెనీగా మార్కెట్లోకి వచ్చిన యాపిల్ కంపెనీ షేరు విలువ పెరిగిన తీరు ఎవరికి అయినా దిమ్మదిరిగేలా చేస్తుంది. 12 డిసెంబర్ 1980లో లిస్టింగ్ నాటికి యాపిల్ షేర్ ధర 51 సెంట్లు మాత్రమే. 1985లో ఛైర్మన్ స్టీవ్ జాబ్స్.. సంస్థను వదిలేయడంతో షేర్ ధర 27 సెంట్లకు తగ్గింది. 1997లో స్టీవ్ మళ్లీ కంపెనీలోకి వచ్చి సీఈఓ గా బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు షేర్ ధర 0.49 డాలర్లు మాత్రమే. 2000లో ఐపాడ్‌ను లాంఛ్ చేయడం.. దాని అమ్మకాలు విప్లవం కావడంతో 1.30 డాలర్లకు చేరుకుంది. జూన్ 2007లో టెక్నాలజీ గతిని మార్చిన ఐఫోన్‌ను మొదటిసారిగా యాపిల్ విడుదల చేసింది. అప్పుడు 17.43 డాలర్లకు యాపిల్ షేర్ చేరుకుంది. 

ఆగస్ట్ 2011లో స్టీవ్ జాబ్స్ అనారోగ్యం కారణంగా సంస్థను వదిలేయగా.. సీఈఓగా టిమ్ కుక్ బాధ్యతలు స్వీకరించే సమయానికి యాపిల్ షేరు విలువ 53.74 డాలర్లు. సెప్టెంబర్ 2012లో కేవలం మూడంటే మూడు రోజుల్లో 50 లక్షల ఐఫోన్‌5లను విక్రయించడంతో... 100 డాలర్ల స్థాయిని యాపిల్ షేర్ అధిగమించింది. 2015 ఫిబ్రవరిలో 122 డాలర్ల మార్కును అందుకోవడం... మార్కెట్లో తొలి 700 బిలియన్ డాలర్ల వాల్యూయేషన్ గల కంపెనీగా రికార్డు సృష్టించింది యాపిల్. ఇప్పుడు 207 డాలర్ల స్థాయికి చేరిన తరుణంలో.. ఒక ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో మరో కొత్త రికార్డును యాపిల్ సృష్టించింది. 

యాపిల్ సంస్థ ప్రారంభించి ఇప్పటికి 42 సంవత్సరాలు గడిచింది. మార్కెట్లలో లిస్ట్ అయి 38 ఏళ్లు పూర్తి కావస్తున్నాయి. ఇంత వేగంగా ఓ పబ్లిక్ కంపెనీ ఎదగడం యాపిల్ విషయంలోనే జరిగింది. ఇక ఈ షేర్ నిలకడగా ఇస్తున్న రాబడులు ఒక లెక్క అయితే.. చివరి దశాబ్దంలోనే అద్భుతమైన మెరుపులు సృష్టించడం గమనించాలి. 2008 ఆగస్టులో యాపిల్ సంస్థ షేర్లపై 1000 డాలర్లు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే.. 2 ఆగస్ట్ 2018 నాటికి.. దాని విలువు 9,222 డాలర్లు. అంటే. 10 ఏళ్ల కాలంలో పెట్టుబడిని 9.2 రెట్లు అందించడం విశేషం.

ఒకవైపు ఫేస్‌బుక్ సంస్థ ఒకే రోజున తన మార్కెట్ విలువను 20 శాతం మేర కోల్పోయిన కొన్ని రోజులకే యాపిల్ మాత్రం ఇలాంటి రికార్డును సృష్టించడం విశేషం. మరోవైపు.. యాపిల్ మార్కెట్ విలువ అమెరికా సంయుక్త రాష్ట్రాల మొత్తం ఎకానమీలో మూడో వంతు ఉండడం మరో పెద్ద రికార్డు. టర్కీ, స్విట్జర్లాంటి లాంటి దేశాల ఎకానమీ కంటే యాపిల్ విలువే ఎక్కువ.

మార్కెట్‌లో జరిగే అద్భుతాలకు.. ముఖ్యంగా టెక్నాలజీ కంపెనీ సృష్టించే విచిత్రాలకు యాపిల్ ప్రత్యక్ష సాక్ష్యం. అలాగని ఇప్పట్లో యాపిల్‌కు పోటీ లేదని అనుకునేందుకు లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం అమెజాన్ షేర్ అత్యంత వేగంగా దూసుకువస్తోంది. అమెాజాన్ మార్కెట్ వాల్యుయేషన్ 883 డాలర్లుగా ఉంది. 1 ట్రిలియన్ డాలర్ల మార్కును అందుకునే మరుసటి కంపెనీ ఇదే అని మార్కెట్ నిపుణులు చెబుతుండగా.. గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ మార్కెట్ వాల్యుయేషన్ 845 డాలర్లుగా ఉంది. అయితే.. వెనుక ఎన్ని కంపెనీలు ఈ రికార్డు మార్కును అందుకున్నా.. మొదట సృష్టించిన రికార్డు ఇచ్చే కిక్కే వేరు కదా.Most Popular