సరఫరాల సెగ- చమురు నేలచూపు!

సరఫరాల సెగ- చమురు నేలచూపు!

అమెరికా ఇంధన నిల్వలు పెరగడం, కువైట్‌లో ఉత్పత్తి ఊపందుకోవడం, చైనాతో వాణిజ్య వివాదాలకు ట్రంప్‌ ప్రభుత్వం కాలుదువ్వడం వంటి అంశాలు బుధవారం ముడిచమురు ధరలను పడగొట్టాయి. లండన్‌ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 2.5 శాతం(2 డాలర్లు) పతనమైంది. 72.39కు చేరింది. ఈ బాటలో న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ సైతం 1.6 శాతం(1.1 డాలర్లు) తిరోగమించి 67.66 డాలర్లను తాకింది. గత రెండు రోజులుగా చమురు ధరలు అమ్మకాలతో నీరసించడంతో ట్రేడర్లు స్క్వేరప్‌ లావాదేవీలకు దిగారు. దీంతో ప్రస్తుతం కొంతమేర కోలుకున్నాయి. బ్రెంట్‌ బ్యారల్‌ 0.2 శాతం బలపడి 72.52 డాలర్లకు చేరగా.. నైమెక్స్‌ నామమాత్ర లాభంతో 67.69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

కారణాలివీ
గత వారానికల్లా అమెరికాలో చమురు నిల్వలు 3.8 మిలియన్‌ బ్యారళ్లమేర పెరిగాయి. నిజానికి 2.8 మిలియన్‌ బ్యారళ్లమేర తగ్గుతాయని అంచనాలు వెలువడ్డాయి. కాగా.. ఇటీవల కువైట్‌లో చమురు ఉత్పత్తి ఊపందుకుంది. ప్రస్తుతం కువైట్‌ రోజుకి 2.8 మిలియన్‌ బ్యారళ్ల చమురును సరఫరా చేస్తోంది. 2016 డిసెంబర్‌ తరువాత ఇది అత్యధికంకాగా.. జూన్‌తో పోలిస్తే జులైలో లక్ష బ్యారళ్లను అదనంగా ఉత్పత్తి చేసినట్లు కువైట్‌ తాజాగా తెలియజేసింది. గత నెలలో రష్యా చమురు ఉత్పత్తి సైతం సగటుకంటే అధికంగా నమోదైంది. 2017లో చేపట్టిన సరఫరాల కోతకు చెక్‌ పెడుతూ ఒపెక్‌ దేశాలు సైతం ఉత్పత్తిని పెంచాయి. దీంతో గత ఆరు నెలలతో పోలిస్తే జులైలో ఒపెక్‌ ఉత్పత్తి పెరిగినట్లు వార్తలు వెలువడ్డాయి.Most Popular