ట్రూజెట్‌ భారీ విస్తరణ, త్వరలో 20 కొత్త నగరాలకు సేవలు

ట్రూజెట్‌ భారీ విస్తరణ, త్వరలో 20 కొత్త నగరాలకు సేవలు

ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్ భారీ విస్తరణ ప్రణాళికలకు సిద్ధమవుతోంది. మూడేళ్లు పూర్తి చేసుకుని నాలుగో యేట అడుగుపెడ్తున్న ఈ సంస్థ ఈ ఏడాది 5 కొత్త ఎయిర్‌క్రాఫ్టులను తీసుకుంటోంది. ఇప్పుడున్న 14 నగరాలకు తోడు మరో 20 నగరాలకు కూడా విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. విమానయనాన్ని చిన్న నగరాల్లోని సామాన్యులకు చేరవేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన 'ఉడాన్' పథకాన్ని సద్వినియోగం చేసుకుంటామని,  మరిన్ని ప్రాంతాలకు సర్వీసులు నడుపుతామని ట్రూజెట్ యాజమాన్యం వెల్లడించింది. ఇప్పటికే కడప, నాందేడ్, బళ్లారి, సేలం నగరాలకు ట్రూజెట్ సంస్థ విమాన సేవలు అందిస్తోంది. ఈ మూడేళ్ల కాలంలో సుమారు 12 లక్షల మంది ప్రయాణీకులకు సేవలను అందించినట్టు తెలిపింది. విపరీతంగా ఉన్న పైలెట్ల కొరత వల్ల మరిన్ని ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నట్టు ట్రూజెట్ సీఈఓ విశోక్ తెలిపారు. ప్రస్తుతం 85 శాతం ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ ఉందని, చిన్న నగరాల్లో కూడా మంచి స్పందన ఉండడం ఆనందంగా ఉందని వివరించారు. 
క్యాష్ ఫ్లోస్ సంతృప్తికరంగా ఉన్నాయని, ఎలాంటి ఆటంకాలూ లేకుండా బకాయిలను తీరుస్తున్నామని.. ఇదే తమ నిర్వాహణకు అద్దం పడ్తోందని ట్రూజెట్ టీం తెలిపింది. ఎబిటా మార్జిన్లు 20 శాతానికి పైగానే ఉన్నాయని, నిర్వాహణ పరంగా చూస్తే లాభాల్లో ఉన్నట్టు వివరించారు. సినీ నటుడు రాంచరణ్, బి ఉమేష్, ప్రేమ్ కుమార్‌లు ట్రూజెట్‌లో ఇంకా డైరెక్టర్లుగానే కొనసాగుతున్నాని కొత్త టీం వెల్లడించింది. 

ఆఫర్
మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూ. 603 కే విమాన టికెట్‌ను అందిస్తున్నామని, ఇది తమను సామాన్యులకు మరింత చేరువ చేస్తుందని ట్రూజెట్ నమ్మకంగా ఉంది.  Most Popular