సెన్సెక్స్‌ రికార్డ్‌- 11,000కు ఎగువన నిఫ్టీ!

సెన్సెక్స్‌ రికార్డ్‌- 11,000కు ఎగువన నిఫ్టీ!

రెట్టించిన ఉత్సాహంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో దేశీ స్టాక్ మార్కెట్లు పరుగందుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 36,699 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. గతంలో నమోదైన 36,444 పాయింట్ల రికార్డును తుడిచిపెట్టింది. ఒక దశలో 425 పాయింట్లు జంప్‌చేసింది. ఇక నిఫ్టీ సైతం 11,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. చివర్లో కొంతమేర వెనకడుగు వేసినప్పటికీ సెన్సెక్స్‌ 282 పాయింట్లు ఎగసి 36,548 వద్ద నిలిచింది. ఇది సరికొత్త గరిష్ట ముగింపుకాగా.. నిఫ్టీ 75 పాయింట్లు జమచేసుకుని 11,023 వద్ద ముగిసింది. ఇది 5 నెలల గరిష్టంకావడం విశేషం!
ఆర్‌ఐఎల్‌ దూకుడు
ఎన్‌ఎస్ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.5 శాతం చొప్పున పుంజుకోగా రియల్టీ, ఆటో, మెటల్‌ రంగాలు 1-0.5 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఆర్‌ఐఎల్ ఒక దశలో 6 శాతం జంప్‌చేసింది. రూ. 1099 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 6.96 లక్షల కోట్లకు చేరింది. 100 బిలియన్‌ డాలర్లను అధిగమించింది. చివరికి 4 శాతం లాభంతో నిలిచింది. కాగా... ఇతర బ్లూచిప్స్‌లో బీపీసీఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో బజాజ్‌ ఫిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ 3-1.6 శాతం మధ్య ఎగశాయి. అయితే మరోపక్క యూపీఎల్‌, వేదాంతా, బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్‌, గ్రాసిమ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, లుపిన్‌, అదానీ పోర్ట్స్‌, జీ, హీరోమోటో 4.2-1 శాతం మధ్య క్షీణించాయి. 
చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు జోరందుకున్నప్పటికీ చిన్న షేర్లు అటూఇటుగా ముగిశాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ 0.5 శాతం బలపడింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1474 నష్టపోగా.. 1168 లాభపడ్డాయి.
ఎఫ్‌పీఐల పెట్టుబడులు!
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 636 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 15 కోట్లను మాత్రమే ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. మంగళవారం ఎఫ్‌పీఐలు కేవలం రూ. 21 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 294 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.Most Popular