వన్నె కోల్పోతున్న పసిడి!

వన్నె కోల్పోతున్న పసిడి!

విదేశీ మార్కెట్లో ఇటీవల బంగారం ధర నేలచూపులకే పరిమితమవుతోంది. బుధవారం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 1 శాతం క్షీణించి 1241 డాలర్లను తాకింది. ఇది వారం రోజుల కనిష్టంకాగా.. ప్రస్తుతం కాస్త కోలుకుని 1244 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో వెండి సైతం ఔన్స్‌ 0.35 శాతం పుంజుకుని 15.87 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 


పలు కారణాలున్నాయ్
ఇప్పటికే అమెరికా చైనా మధ్య వాణిజ్య వివాదాలు తలెత్తగా.. తాజాగా 200 బిలియన్‌ డాలర్ల చైనీస్‌ దిగుమతులపై 10 శాతం టారిఫ్‌లను విధించనున్నట్లు అమెరికా ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 94.70కు బలపడింది. జపనీస్‌ యెన్‌ ఆరు నెలల కనిష్టం 112ను తాకింది. కాగా..  అమెరికా ఆర్థిక వ్యవస్థ జోరందుకుంటున్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాది కనీసం మరో రెండుసార్లు వడ్డీ రేట్లను పెంచే అవకాశముంది. అంతేకాకుండా కంపెనీల పనితీరుపై అంచనాలు పెరిగి 2018లో అమెరికా స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి కూడా.
యూరప్‌లోనూ 
గత కొంతకాలంగా యూరోజోన్‌లోనూ సానుకూల పరిస్థితులు నెలకొంటుండటంతో యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌(ఈసీబీ) వచ్చే(2019) జులైకల్లా వడ్డీ రేట్ల పెంపు బాట పట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈసీబీ సహాయక ప్యాకేజీలకు ముగింపు పలికే సన్నాహాల్లో ఉన్న విషయం విదితమే. కాగా.. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో రష్యా 92.56 టన్నుల పసిడిని ఉత్పత్తి చేసింది. 2017 తొలి 5 నెలలతో పోలిస్తే ఇది 2.3 టన్నులు అధికం. ఈ అన్ని సానుకూల అంశాలూ బంగారం ధరలను దెబ్బతీస్తున్నట్లు బులియన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 
రక్షణాత్మకం
డాలరు బలపడటం, వడ్డీ రేట్లు పెరగడం వంటి అంశాలు బంగారంలో పెట్టుబడులకు విఘాతం కలిగిస్తుంటాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు సాధారణంగా బంగారం ధరలు జోరందుకుంటాయని.. రిటర్నులకంటే రక్షణాత్మక పెట్టుబడిగానే పసిడికి గిరాకీ ఏర్పడుతుందని వివరిస్తున్నారు.Most Popular