లిబియా ఎఫెక్ట్‌- కుప్పకూలిన చమురు ధర! 

లిబియా ఎఫెక్ట్‌- కుప్పకూలిన చమురు ధర! 

10 రోజులుగా మూసివేసిన నాలుగు పోర్టులను తిరిగి తెరిచినట్లు లిబియా ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. బుధవారం లండన్‌ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్‌ ఏకంగా 7 శాతం పతనమైంది. 5.5 డాలర్లు జారి 73.40 డాలర్లను తాకింది. ఈ బాటలో న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ చమురు సైతం బ్యారల్‌ 5 శాతం(3.75 డాలర్లు)  దిగజారి 70.35 డాలర్లకు చేరింది. వెరసి చమురు ధరలు 2017 జూన్‌ తరువాత అత్యంత భారీగా పతనమయ్యాయి. కాగా... ట్రేడర్లు స్క్వేరప్‌ లావాదేవీలు చేపట్టడంతో ప్రస్తుతం కాస్త కోలుకున్నాయి. బ్రెంట్‌ బ్యారల్‌ 1.7 శాతం ఎగసి 74.61 డాలర్లకు చేరగా.. నైమెక్స్‌ 0.5 శాతం పుంజుకుని 70.74 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 
టారిఫ్‌ వార్‌ 
ఫిబ్రవరిలో రోజుకి 1.28 మిలియన్‌ బ్యారళ్ల చమురును ఉత్పత్తి చేసిన లిబియా ఇటీవల 5.27 లక్షల బ్యారళ్లకు పరిమితమైంది. ఇందుకు అంతర్యుద్ధంకారణంకాగా.. ప్రస్తుతం నాలుగు పోర్టులను తిరిగి ప్రారంభించడంతో లిబియా నుంచి చమురు ఎగుమతులు పుంజుకోనున్నాయి. రోజుకి 8 లక్షల బ్యారళ్ల చమురును ఎగుమతి చేసే అవకాశముంది. కాగా మరోవైపు అమెరికా-చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి లోనుకావచ్చన్న అంచనాలు పెరిగాయి. ఫలితంగా చమురుకు డిమాండ్‌ తగ్గవచ్చన్న అంచనాలు పెరిగి  ధరలను దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే అమెరికాలో గత వారాంతానికల్లా చమురు నిల్వల్లో 12.6 మిలియన్‌ బ్యారళ్లమేర కోత పడినట్లు వెల్లడికావడంతో ధరలు కొంతమేర పుంజుకున్నట్లు తెలియజేశారు.  
మనకు లాభమే
దేశీ ఇంధన అవసరాలకు 75 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకోవలసి ఉండటంతో ప్రభుత్వానికి చేతిచమురు బాగానే వొదులుతోంది. దీంతో దిగుమతుల బిల్లు పెరుగుతోంది. ఇది వాణిజ్య లోటుకు కారణమవుతోంది. దిగుమతుల బిల్లును డాలర్లలో  చెల్లించాల్సి ఉండటంతో రూపాయి బలహీనపడుతోంది. చమురు ధరల పెరుగుదల వల్ల దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగి ప్రజలపై భారం పడుతోంది. అంతేకాకుండా ద్రవ్యోల్బణానికీ దారితీస్తోంది. చమురు ధరలు తగ్గితే ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా సంస్థలకు సబ్సిడీ చెల్లింపుల భారం సైతం తగ్గుతుంది. Most Popular