టారిఫ్‌ భయాలున్నా సానుకూల ఓపెనింగ్‌?!

టారిఫ్‌ భయాలున్నా సానుకూల ఓపెనింగ్‌?!

వరుసగా రెండు రోజులపాటు లాభాల దౌడు తీశాక బుధవారం కన్సాలిడేషన్‌ బాట పట్టిన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 10,981 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. అయితే చైనాతో వాణిజ్య వివాదాలు ముదురుతుండటంతో బుధవారం అమెరికా మార్కెట్లు నష్టపోయాయి. కాగా... బుధవారం ఒడిదొడుకుల మధ్య సెన్సెక్స్‌ 26 పాయింట్ల స్వల్ప లాభంతో 36,266 వద్ద నిలవగా.. నిఫ్టీ నామమాత్రంగా 1 పాయింట్ బలపడి 10,948 వద్ద స్థిరపడింది.  

నిఫ్టీ కదలికలు ఇలా..! 
నేడు నిఫ్టీ బలహీనపడితే తొలుత 10,922 పాయింట్ల వద్ద, తదుపరి 10,896 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 10,976 పాయింట్ల వద్ద, తదుపరి 11,003 స్థాయిలోనూ రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. 

ఎఫ్‌పీఐల పెట్టుబడులు!
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 636 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 15 కోట్లను మాత్రమే ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. మంగళవారం ఎఫ్‌పీఐలు కేవలం రూ. 21 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 294 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
 
.Most Popular