యూఎస్‌ లాభాల్లో- పెప్సీ, కోకా కోలా అండ!

యూఎస్‌ లాభాల్లో- పెప్సీ, కోకా కోలా అండ!

ఈ ఏడాది రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించడంతో పానీయాల దిగ్గజం పెప్సీకో 5 శాతం జంప్‌చేసింది. ఈ బాటలో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం పీఅండ్‌జీ 2.5 శాతం, కోక కోలా 1.5 శాతం చొప్పున ఎగశాయి. దీంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడగా.. ఎస్‌అండ్‌పీ ఫిబ్రవరి తరువాత గరిష్ట స్థాయిని అందుకుంది. ట్రేడింగ్‌ ముగిసేసరికి డోజోన్స్‌ 143 పాయింట్లు(0.6 శాతం) పెరిగి 24,920 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 10 పాయింట్లు(0.35 శాతం) ఎగసి 2,794 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ నామమాత్రంగా 3 పాయింట్లు(0.04  శాతం) బలపడి 7,759 వద్ద ముగిసింది. 

చైనాపై టారిఫ్‌లు?
అమెరికా, చైనా దెబ్బకుదెబ్బ అనే విధంగా వారాంతాన 34 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులపై టారిఫ్‌లు విధించుకున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికా ప్రభుత్వం మరో 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలను విధించాలని యోచిస్తున్నట్లు వార్తలు వెలువడటంతో సెంటిమెంటు బలహీనపడింది. దీంతో మార్కెట్లు ముగిశాక స్టాక్‌ ఫ్యూచర్స్‌ దెబ్బతిన్నాయి. కాగా.. సోమవారం జోరందుకున్న జేపీ మోర్గాన్‌, వెల్స్‌ఫార్గో, సిటీగ్రూప్‌ కౌంటర్లు లాభాల స్వీకరణ కారణంగా బలహీనపడ్డాయి.Most Popular