విదేశీ మార్కెట్లు ఓకే- అయినా వీక్‌ ఓపెనింగ్‌?!

విదేశీ మార్కెట్లు ఓకే- అయినా వీక్‌ ఓపెనింగ్‌?!

సానుకూల ప్రపంచ సంకేతాలతో రెండు రోజులుగా జోరందుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 21 పాయింట్లు నీరసించి 10,937 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. అయితే మంగళవారం మరోసారి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియగా.. ప్రస్తుతం ఆసియాలో ప్రతికూల ధోరణి కనిపిస్తోంది. అమ్మకాలదే పైచేయిగా ఉంది. చైనా దిగుమతులపై మళ్లీ అమెరికా టారిఫ్‌లు విధించనుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య సాగే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మంగళవారం సెన్సెక్స్‌ 305 పాయింట్లు పెరిగి 36,240 వద్ద నిలవగా.. నిఫ్టీ 94 పాయింట్లు జంప్‌చేసి 10,947 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ కదలికలు ఇలా..! 
నేడు నిఫ్టీ బలహీనపడితే తొలుత 10,897 పాయింట్ల వద్ద, తదుపరి 10,847 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 10,977 పాయింట్ల వద్ద, తదుపరి 11,007 స్థాయిలోనూ రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. 

ఎఫ్‌పీఐలు సైలెంట్‌
నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మంగళవారం సైలెంట్‌ అయ్యారు. కేవలం రూ. 21 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. ఎఫ్‌పీఐలు సోమవారం రూ. 570 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా .. సోమవారం రూ. 740 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) మంగళవారం మరోసారి రూ. 294 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. 
 Most Popular