కొనుగోళ్ల జోరు- ట్రిపుల్‌ సెంచరీతో ముగింపు!

కొనుగోళ్ల జోరు- ట్రిపుల్‌ సెంచరీతో ముగింపు!

మొదటినుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో మెరుగుపడ్డ సెంటిమెంటు కారణంగా మార్కెట్లు సమయం గడిచేకొద్దీ బలపడుతూ వచ్చాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 305 పాయింట్లు పెరిగి 36,240 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 94 పాయింట్లు జంప్‌చేసి 10,947 వద్ద స్థిరపడింది. 
ఫార్మా వీక్‌
ఎన్‌ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. ఫార్మా 0.35 శాతం నీరసించింది. రియల్టీ, మెటల్‌, పీఎస్యూ బ్యాంక్స్‌, ఆటో, ఐటీ 1.8-0.8 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్‌, హిందాల్కో, ఆర్‌ఐఎల్‌, కోల్‌ ఇండియా, యస్‌బ్యాంక్‌, ఐషర్‌, విప్రో, బజాజ్‌ ఆటో, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోవైపు హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, ఐబీ హౌసింగ్, ఇండస్‌ఇండ్, కొటక్‌ బ్యాంక్‌, లుపిన్‌, హీరోమోటో, సన్ ఫార్మా, జీ, డాక్టర్‌ రెడ్డీస్‌ 2-0.5 శాతం మధ్య నష్టపోయాయి.
చిన్న షేర్లు ప్లస్‌
మార్కెట్ల బాటలో చిన్న షేర్లూ పుంజుకున్నాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1665 లాభపడగా.. 972 మాత్రమే నష్టపోయాయి.
అమ్మకాలవైపే ఎఫ్‌పీఐలు
నగదు విభాగంలో శుక్రవారం రూ. రూ. 968 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం మరోసారి రూ. 570 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. కాగా .. ముందురోజు రూ. 1481  కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సోమవారం మరో రూ. 740 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. Most Popular