రూ.100తో కూడా మంచి రాబడి పొందవచ్చా, మీ పెట్టుబడికి భరోసా ఈ స్టోరీ

రూ.100తో కూడా మంచి రాబడి పొందవచ్చా, మీ పెట్టుబడికి భరోసా ఈ స్టోరీ

వేలకి వేలు డబ్బులు పెట్టుబడి పెడితేనే లక్షలు సంపాదించగలరు..లేదంటే భారీగా ఆదాయం తెచ్చుకోవాలంటే అదే స్థాయిలో ఇన్వెస్ట్ చేయాలి అనే అపోహలు చాలామందికి ఉంటాయి. ఐతే అలా కాకుండా పద్దతిగా చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేసినా మంచి రాబడి అందుకోగల అవకాశం ఉంది. ఐతే ఇక్కడ ముఖ్యమైనదల్లా ఏ వయసులో పెట్టుబడి ప్రారంభించామనేదే ! అలా చక్కగా చిన్న మొత్తాలలో అంటే రూ.100తో కూడా మంచి పెట్టుబడికి మార్గాలు ఏవి ఉన్నాయో చూద్దాం


మ్యూచువల్ ఫండ్స్
అందరికీ తెలిసిన పేరే..ఐతే పెట్టుబడి మాత్రం ఏ కొంతమంది మాత్రమో చేస్తారు. క్రమశిక్షణ, సమయపాలన, ఓర్పు కలిగినవారే ఇందులో పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే విత్తనం నాటగానే ఫలితాలు రావు. చెట్టు అవ్వాలి. ఆ తర్వాత పళ్లు కాయాలి అప్పుడు కదా అసలు మాజ దక్కించుకునేది.మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.500 నుంచి కూడా పెట్టుబడి చేయవచ్చు. సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్..దఫాలుగా పెట్టుబడి పెట్టడమే ఇందులో కీలకం. దీనికోసం ప్రతి నెలా ఏదోక మొత్తం అనుకుని అదే మొత్తాన్ని కొనసాగిస్తూ పోయినప్పుడు నెట్ ఎసెట్ వేల్యూ తగ్గినా సగటున మనకి నష్టం ఏర్పడదు. రిస్క్ తీసుకోలేరు అనుకున్నవాళ్లు డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్, పర్లేదు కాస్త రిస్క్ తీస్కోవచ్చు అనుకున్నవాళ్లు ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
గ్యారంటీ రిటర్న్స్‌తో ప్రభుత్వ అధీనంలో నడిచే ప్రజాభవిష్యనిధిలో పెట్టుబడి కనీసం మొత్తం రూ.500, అది కూడా ఏడాదికి. ఇలా అత్యధికంగా సంవత్సరానికి లక్షన్నరరూపాయల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. నెలా నెలా కూడా రూ.500 చొప్పున ఇన్వెస్ట్ చేయవచ్చు. ఐతే ఈ పథకంలో పెట్టుబడులపై ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రేటు మారుతుంటుంది. ప్రస్తుతానికి ఇది 7.6శాతంగా ఉంది. పిపిఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మనం పొందే అత్యధ్భుతమైన రాయితీ ఏమిటంటే పెట్టుబడి, లాభం,వడ్డీ దేనిపైనా పన్ను కట్టక్కర్లేదు. ఇందులో ఎంత పెట్టుబడి పెడితే అంత మేరా సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. పిపిఎఫ్ మెచ్యూరిటీ పీరియడ్ 15 సంవత్సరాలు. ఐతే మధ్యలో కూడా ప్రత్యేకించిన సందర్భాలలో( పిల్లల్ల పెళ్లిళ్లు, వైద్య చికిత్సల కోసం అయ్యే ఖర్చు వంటివి) పాక్షికంగా డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.


రికరింగ్ డిపాజిట్లు
షేర్లు, మ్యూచువల్ ఫండ్లు అంటే గాభరా పడేవాళ్లు గత 50,60ఏళ్లుగా చేస్తోన్న పెట్టుబడుల మార్గం- రికరింగ్ డిపాజిట్లు. ఏడాది నుంచి పదేళ్ల కాలవ్యవధిని బట్టి కొంత మొత్తం డిపాజిట్ చేయడం..దానిపై వచ్చే వడ్డీని కూడా తిరిగి అందులోనే పెట్టుబడి పెట్టడమే ఈ స్కీమ్ ముఖ్య లక్షణం. నెలకి రూ.100తో కూడా రికరింగ్ డిపాజిట్లు మొదలుపెట్టవచ్చు. వీటిపైన బ్యాంకును బట్టి 6శాతం నుంచి 7శాతం వరకూ వడ్డీ లభ్యమవుతుంది. ఇందులో వచ్చే వడ్డీపై కూడా పన్ను పడే ఆదాయం కిందే చూడాలి. ఇలా ఆర్‌డిలపై వచ్చే వడ్డీ ఒక ఏడాదిలో రూ.10వేలు దాటితే స్వయంగా బ్యాంకే పదిశాతం టిడిఎస్ కట్ చేస్తుంది

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్
గ్రామీణ భారతం నుంచి పట్టణాల వరకూ అందరికీ సుపరిచితమైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ పోస్టాఫీసుల ద్వారా పొందవచ్చు. రూ.100 నుంచి రూ.10వేల వరకూ లభ్యమయ్యే ఈ సర్టిఫికెట్లపై 7.6శాతం వడ్డీ రేటు నడుస్తోంది. ఇది కూడా చక్రవడ్డీ ఆధారిత పథకమే. అసలు వడ్డీ కలిపి మొత్తం పథకం తాలూకూ సర్టిఫికెట్ల గడువు పూర్తైన తర్వాత మాత్రమే చెల్లిస్తారు. అలా ఐదేళ్లలో రూ.100 రూ.144కి పెరుగుతుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన డబ్బుకు సెక్షన్ 80సి కింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది


ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్
కొన్ని లిస్టెడ్ కంపెనీల షేర్లతో కలిసిన ఫండ్లని ఈటిఎఫ్‌లుగా పిలుస్తారు. ఇవి కూడా షేర్లలానే ట్రేడవుతుంటాయి. ఇవి ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు.అమ్ముకోవచ్చు. ఎగ్జిట్ లోడ్ పేరిట ఈ ఫండ్లను అమ్ముకున్న తర్వాత కొద్దిగా ఛార్జ్ చేయడం మాత్రం ఉంటుంది. వీటిలో వడ్డీ రేటు కానీ..పన్ను మినహాయింపు కానీ ఎలాంటి ఇతర రాయితీలు ఉండవు. ఐతే రిస్క్ ఎక్కువే ఉంటుంది.Most Popular