ఆడిటర్లపై కేంద్రానికి పెద్ద ఇన్వెస్టర్ల మొర !

ఆడిటర్లపై కేంద్రానికి పెద్ద ఇన్వెస్టర్ల మొర !

ఆడిటర్ల రాజీనామాల పర్వంతో స్టాక్ మార్కెట్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు భారీ నష్టాల పాలవుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 30 మంది ఆడిటర్లు రాజీనామా చేశారు. ఈ సంఖ్య మరింత పెరిగే అకాశాలున్నాయి. వక్రాంజీ, మన్‌పసంద్ బెవరేజెస్ ఆడిటర్ల రాజీనామాలతో ఆ షేర్లు   లోయర్ సర్క్యూట్లు పడటంతో  ఆ షేర్లనుంచి ఇన్వెస్టర్లు బయటపడే మార్గం లేకుండా పోయింది.  మన్‌పసంద్ బెవరేజెస్ షేరు మే 22న రూ. 448గా ఉంటే, రూ. 147 లకు పడిపోయింది

ఈ మధ్య చాలా కంపెనీల నుంచి ఆడిటర్లు మధ్యలోనే నిష్క్రమిస్తున్న సంఘటనలు  ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో కంపెనీల షేర్లు కుప్పకూలడం చిన్న, పెద్ద ఇన్వెస్టర్ల సంపద ఆవిరి అయిపోతోంది. ప్రముఖ ఆడిటింగ్ ఏజెన్సీలు తమ నిష్క్రమణకు సంబంధించి వివరణ కూడా ఇవ్వకుండా జారుకోవడం చాలా ఆందోళన కలిగించే అంశం. దీని వల్ల స్టాక్‌ మార్కెట్లలో ఆయా కంపెనీల షేర్ల ధరలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.

వక్రాంజీకి సంబంధించిన బులియన్, జుయెల్లరీ, వ్యాపారాలకు సంబంధించిన వివరాలపై ఆడిటర్ ప్రైస్ వాటర్‌హౌజ్ సమాచారాన్ని అడిగింది. గతంలో ఇచ్చిన వివరణలకు విరుద్ధంగా వివరణలు వుండడంతో వాటిని ఆమోదించలేక రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే మన్‌పసంద్ బెవరేజెస్‌కు సంబంధించి కూడా అంతే. అవసరమైన ముఖ్య సమాచారాన్ని కంపెనీ అందించలేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్టు ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ ప్రకటించింది. శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్ కంపెనీ షేర్లు కూడా ఆడిటర్ రాజీనామా పుకార్లతో భారీగా నష్టపోయాయి. శ్రీఅధకారి బ్రదర్స్, టచ్‌వుడ్ ఎంటర్‌టెయిన్‌మెంట్, ఫోర్త్ డైమెన్షన్ సొల్యూషన్స్ ఆడిటర్లు వివిధ కారణాలతో ఆ కంపెనీల ఆడిటింగ్ నుంచి తప్పుకున్నారు. 

అంతేకాదు ఆర్థిక ఫలితాల వెల్లడి సమయంలో ఈ రాజీనామాలు వెలువడుతుండడంతో కంపెనీల బ్యాలన్స్‌షీట్లపై సందేహాలు రేకెత్తుతున్నాయి. ఆడిటర్లతో పాటు కొన్ని కంపెనీల ఇండిపెండెంట్ డైరక్టర్లు, కంపెనీ సెక్రటరీలు కూడా రాజీనామా చేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు మాత్రం తమ ఆందోళనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. త్వరలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెబి అధికారవర్గాలు, ఐసిఎఐ ప్రతినిధులతో ఒక సమావేశం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వాటాదారులకు ఆడిటర్లు జవాబుదారీగా వ్యవహరించాల్సి ఉంటుంది. కంపెనీ ఖాతాల్లో ఏదైనా తేడా ఉంటే ఇన్వెస్టర్లకు తెలియజేయాలి. కంపెనీలో ఏం జరుగుతుందో చెప్పకుండా అర్ధాంతరంగా ఆడిటర్లు వైదొలగడం పట్ల కంపెనీ వేల్యూయేషన్ పై దెబ్బ పడుతోంది. కంపెనీ వెల్లడిస్తున్న గణాంకాలపైనా సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆడిటర్లు ఏదో ఒక సాకుతో విధుల నుంచి నిష్క్రమించకుండా అసలు విషయాలను వెల్లడించడం వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
 
ఇదిలా ఉంటే కంపెనీల్లో ఆర్థిక అవకతవకలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు ఆయా కంపెనీల ఆడిటర్లను కూడా వదిలిపెట్టడం లేదు. దీంతో ఆడిటర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కంపెనీ లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలు తమ చేతికి అందనట్టయితే ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో సత్యం స్కామ్ లో ఆడిటర్లదే తప్పంటూ ఐదుగురు ఆడిటర్లపై జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రమోటర్లు కచ్చితమైన అకౌంటింగ్ సమాచారాన్ని ఇస్తే తప్ప ఆడిటర్లు బ్యాలన్స్ షీట్లను, ఆర్థిక ఫలితాలను ఆమోదించడంలేదు.  పరిస్థితులు చేయిదాటక ముందే తమ విధుల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నారు.Most Popular