ఈ స్టాక్‌ కోసం ఎఫ్‌పీఐలు ఎందుకు వెంటపడుతున్నారో తెలుసా..?

ఈ స్టాక్‌ కోసం ఎఫ్‌పీఐలు ఎందుకు వెంటపడుతున్నారో తెలుసా..?

గత ఆరు నెలలుగా దేశీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ ఓ స్టాక్‌ మాత్రం తన జోరును కొనసాగిస్తోంది. గత మూడు సెషన్లుగా 14 శాతం లాభపడిన వీమార్ట్‌ రిటైల్‌ ఇవాళ మరో 7 శాతం లాభపడి ఇన్వెస్టర్లను ఆనందంలో ముంచెత్తింది. ఇవాళ రూ.3,036కు చేరి ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిని నమోదు చేసింది.

రిటైల్‌ రంగ సంస్థ వీమార్ట్‌ రిటైల్‌ ఈ ఏడాది జోరుమీదుంది. తొలి 6 నెలల్లోనే ఈ స్టాక్ ధర రెట్టింపైంది. భారత్‌లో రిటైల్ మార్కెట్‌కు చక్కని డిమాండ్‌ ఉండటంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ స్టాక్‌ను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఎఫ్‌పీఐలు తమ వాటాను దాదాపు ఒకశాతం పెంచుకున్నారు. దీంతో గత ఏడాది డిసెంబర్‌ 29న రూ.1,488గా ఉన్న ఈ స్టాక్‌ 104శాతం పెరిగి రూ.3వేల మార్కును అధిగమించింది. 

ఇక 2017 క్యాలెండర్‌ ఇయర్‌లో ఈ స్టాక్‌ ఆకాశమే హద్దుగా పెరిగింది. గతేడాది వీమార్ట్‌ ఏకంగా 220 శాతం లాభపడింది. ఇదే సమయంలో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ 28 శాతం పెరిగింది. మొత్తం మీద గత నెల చివరినాటికి వీమార్ట్‌లో ఎఫ్‌పీఐల వాటా 31.27 శాతం నుంచి 32.24 శాతానికి పెరిగింది. జూన్‌ త్రైమాసికంలో ఎఫ్‌పీఐలు అదనంగా 1,83,633 ఈక్విటీ షేర్లను తమ ఖాతాలో జమ చేసుకున్నారు. 

మరోవైపు వీమార్ట్‌ మార్కెట్‌ అంచనాలను మించి ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తోంది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వీమార్ట్‌ నికరలాభం 77 శాతం వృద్ధితో రూ.777 మిలియన్లుగా నమోదైంది. టైర్‌-2, టైర్‌-3 పట్టణాల్లో యువత ఫ్యాషన్‌కు జై కొట్టడంతో వీమార్ట్‌ లాభాలు గణనీయంగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో వీమార్ట్‌ ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.12.22 బిలియన్లుగా నమోదైంది. న్యూఢిల్లీ కేంద్రంగా ప్రారంభమైన ఈ కంపెనీ తమ కార్యకలాపాలను ఈశాన్య రాష్ట్ట్రాలతో పాటు వాయువ్య భారత్‌లోనూ విస్తరించింది. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలనే ప్లాన్‌తో ఉన్న ఈ కంపెనీ తమ లాభాలను రెట్టింపు చేసుకునే లక్ష్యంతో దూసుకెళ్తోంది. Most Popular