ఇవీ తగ్గాయ్‌.. మరి లాభపడిన స్టాక్స్‌ ఏంటి?

ఇవీ తగ్గాయ్‌.. మరి లాభపడిన స్టాక్స్‌ ఏంటి?

అంతర్జాతీయంగా భయాలు నెలకొన్నప్పటికీ ఈ ఏడాది బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు ఔట్‌పెర్ఫామ్‌ చేశాయి. అయితే బోర్డర్‌ ఇండిసెస్‌ మాత్రం భారీ కరెక్షన్‌కు గురయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 14 శాతం పైగా నష్టపోయింది. ఇదే సమయంలో నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా 21 శాతం క్షీణించింది. అయితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 ఇండెక్స్‌ మాత్రం ఈ ఏడాది 2శాతం పైగా లాభపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలహీనపడటం, క్రూడాయిల్‌ ధరలు పెరగడం, గ్లోబల్‌ ట్రేడ్‌వార్‌ తదితర భయాలతో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈ ఏడాది తొలి 6 నెలల్లో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌లో టాప్‌ ఫైవ్‌ బెస్ట్‌ స్టాక్స్‌, అత్యంత నిరుత్సాహకరమైన స్టాక్‌ వివరాలు దిగువ అందిస్తున్నాం.

మిడ్‌క్యాప్‌లో టాప్‌ బెస్ట్‌ స్టాక్స్‌..
Indiabulls Ventures: విదేశీ ఇన్వెస్టర్లకు ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో కంపెనీ షేర్లను జారీ చేసింది. 

Mindtree : రూపాయి మారకంలో హెచ్చుతగ్గులు కంపనీ షేర్‌ ధర పెరుగుదలకు దోహదపడ్డాయి. 

Jubilant Foodworks: గత ఆరేళ్ళలో అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరగడంతో ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. గతంలో వెలువడిన పలు త్రైమాసికాల్లో ఎనలిస్టుల అంచనాలను అధిగమిస్తూ కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 

Mphasis and Hexaware: నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఔట్‌పెర్ఫామ్‌ చేయడంతో ఆ రంగంలోని అన్ని షేర్లు ఈ ఏడాది భారీగా లాభపడ్డాయి. ఎంఫసిస్‌ కూడా ఈ ఏడాది దాదాపు 50 శాతం లాభపడింది.

Gruh Finance: హెచ్‌డీఎఫ్‌సీ అనుబంధ సంస్థ అయిన గృహ్‌ఫైనాన్స్‌ ఇటీవలే 1:1 బోనస్‌ ఇష్యూను ప్రకటించింది. మొండి బకాయిలు అసలు లేకపోవడం కంపనీకి కలిసొచ్చింది. 

మిడ్‌క్యాప్‌లో అత్యంత నిరుత్సాహకర షేర్లు ఇవే..
Vakrangee: కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ఇష్యూలు, సంబంధం లేని వ్యాపారాల్లో పెట్టుబడులు, ఆడిటర్ల రాజీనామాతో గత కొంతకాలంగా వక్రంగి భారీగా నష్టపోయింది. మధ్యలో కొన్ని సెషన్లు అప్పర్‌ సర్క్యూట్లు టచ్‌ చేసినప్పటికీ ప్రస్తుతం ఇంకా డౌన్‌ట్రెండ్‌లోనే ఉంది. 

PC Jeweller: తమ కుటుంబ సభ్యులకు సంస్థ వ్యవస్థాపకులు బహుమతి రూపంలో కొన్ని షేర్లను ఇవ్వడం, వక్రంగిలో పెట్టుబడులు పెట్టడంతో పీసీ జ్యువెలర్స్‌ ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఇన్వెస్టర్లు ఆందోళనకు గురికావడంతో ఈ స్టాక్‌ 72 శాతం పైగా క్షీణించింది. 

Adani Power:  మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.550 కోట్ల నష్టాన్ని నమోదు చేయడం కంపెనీని ఇబ్బందులు పెట్టింది. 2017 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.792 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. దీంతో మార్చిలో లాభాలు ఒక్కసారిగా తగ్గడం ఇన్వెస్టర్లను ఆయోమయానికి గురిచేసింది.

Suzlon : కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ఇబ్బందులు, క్యూ-4లో లాభాలు ఒక్కసారిగా తగ్గడంతో ఈ ఏడాది ప్రథమార్థంలో ఈ కంపెనీ భారీగా నష్టపోయింది. 

Bank of India : మొండి బకాయిల సమస్యతో ఈ సంస్థ ఇబ్బందులు పడుతోంది.

స్మాల్‌క్యాప్‌లో టాప్‌ బెస్ట్‌ స్టాక్స్‌..

NIIT Technologies: ఢిల్లీకి చెందిన ఐటీ సొల్యూషన్స్‌ ప్రొవైడర్ సంస్థ మార్చి 31తో ముగిసిన నాల్గో త్రైమాసికంలో ప్రోత్సాహకరమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. వచ్చే ఏడాది కాలానికి భారీగా ఆర్డర్లు రావడం కంపెనీ సెంటిమెంట్‌ను బలపర్చింది. 

HEG & Graphite India: చైనా ప్రభుత్వ నిర్ణయం మన గ్రాఫైట్‌ సంస్థల పంట పండించింది. దీంతో దేశీయ సంస్థలైన హెచ్‌ఈజీ, గ్రాఫైట్‌ ఇండియాల్లో ఈ ఏడాది ప్రారంభం నుంచి ర్యాలీ కనిపించింది. 

Tata Elxsi: మార్చ్‌ త్రైమాసికంలో అద్భుత పనితీరుతో అంచనాలను మించి లాభాలు నమోదు చేయడం, ఎన్నో కొత్త టెక్నాలజీలను డెవలప్‌ చేయడంతో టాటా ఎలాక్సీలో ర్యాలీ కనిపించింది.

Lakshmi Machine Works: మార్చి త్రైమాసికంలో ఆదాయం, లాభాల వృద్ధి భారీగా నమోదు కావడం, టెక్స్‌టైల్‌ రంగం పుంజుకోవడం కంపెనీ సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు ఈ స్టాక్‌ దాదాపు 35 శాతం లాభపడింది.

స్మాల్‌క్యాప్‌లో అత్యంత నిరుత్సాహకర షేర్లు ఇవే..
Reliance Naval and Engineering: అనిల్‌ అంబానీ గ్రూపునకు చెందిన రిలయన్స్‌ నావల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ మనుగడపై ఇటీవల ఆ సంస్థ ఆడిటర్లు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రుణ పునర్‌వ్యవస్థీకరణ చేసుకోవడంలో విఫలం కావడం కూడా సంస్థ సెంటిమెంట్‌ను బలహీనపర్చింది.

Hindustan Construction Company: బ్యాంక్‌ రుణాలను తిరిగి చెల్లించడంతో విఫలం కావడం, లవాసా ప్రాజెక్ట్‌ కోసం పర్యావరణ అనుమతులు రాకపోవడం సంస్థ సెంటిమెంట్‌ను బలహీనపర్చింది.

Manpasand Beverages: సంస్థ ఆడిటర్లు అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఈ స్టాక్‌ సెంటిమెంట్‌ బలహీనపడింది.

Reliance Communications: రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌తో ఒప్పందం ఆలస్యం కావడం, వైర్‌లెస్‌ వ్యాపారాన్ని విక్రయించడంతో ఆర్‌కామ్‌ షేర్‌ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. 

Jet Airways: ఈ కంపెనీ నష్టాలతో సతమతమవుతోంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.1,036 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం కూడా భారీగా తగ్గి రూ.5,925 కోట్లకు పడిపోయింది. Most Popular