డిస్ట్రిబ్యూటర్ కమీషన్‌లపై సెబీ జోక్యం చేసుకోవాలి : మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వర్గాలు

డిస్ట్రిబ్యూటర్ కమీషన్‌లపై సెబీ జోక్యం చేసుకోవాలి : మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వర్గాలు

డిస్ట్రిబ్యూటర్ కమీషన్‌ను నిలుపుదల చేయమని మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ, సెబీని ఆశ్రయిస్తూ లేఖ రాసింది. వివరాల్లోకి వెళితే మ్యూచువల్ ఫండ్ లోని బిగ్ ప్లేయర్స్ పరిశ్రమలో డిస్ట్రిబ్యేటర్ కమీషన్ విషయమై గరిష్ట పరిమితి కమిషన్ విషయంలో సర్క్యూలర్ జారీ చేయాలని సెబీని లిఖిత పూర్వకంగా కోరింది. ఇదే సమయంలో మార్కెట్ రెగ్యులేటర్ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీల(ఏఎంసీ)ను అత్యున్నత ప్రమాణాలు పాటించాల్సిందిగా ఇప్పటికే గైడ్ లైన్స్ విడుదల చేసింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా(ఎఎంఎఫ్ఐ) నుంచి ఈ మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. మరో వైపు ఈ మార్గదర్శకాలను యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్లు ఇండస్ట్రీలోని విభాగాలే ఆరోపణలు చేయడం గమనార్హం.

ఎఎంఎఫ్ఐ గైడ్ లైన్స్ ప్రకారం, డిస్ట్రిబ్యూటర్స్‌కు కమీషన్ 100 బేసిస్ పాయింట్లకు క్యాప్ చేయబడి ఉంది. అంటే ఏఎంసీలు ప్రతీ రూ.100లకు గరిష్టంగా కమీషన్ రూ.1 మాత్రమే డిస్ట్రిబ్యూటర్‌కు చెల్లించేలా ఉంది. అయితే కొన్ని ఏఎంసీలు మాత్రం తమ ప్రాడెక్టులను మదుపరులకు అంటగట్టేందుకు డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద ఎత్తున కమీషన్లు ఇస్తున్నాయి. అయితే ఇలాంటి విధానాలు పరిశ్రమలో ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ రెగ్యులేటర్ జోక్యం చేసుకొని స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్ కమీషన్‌ను నిర్ధారించాలని లేఖలో పేర్కొన్నాయి.

ఒక అధ్యయనం ప్రకారం కొన్ని రకాల ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్స్ అమ్మేందుకు సుమారు 200 బేసీస్ పాయింట్లు చెల్లిస్తుండగా, క్లోజ్డ్ ఎండెడ్ స్కీమ్స్ అమ్మకాలు జరపినందుకు 600 బేసిస్ పాయింట్ల వరకూ కమీషన్ చెల్లించినట్లు తెలిసింది.

నిజానికి గైడ్ లైన్స్ ను ఎవరూ పాటించడం లేదని, వివిధ రకాల స్కీంలను మార్కెట్లో విక్రయించేందుకు ఇష్టారాజ్యంగా కమీషన్లు అందుతున్నాయని పరిశ్రమకు చెందిన ప్రముఖుడొకరు తెలిపారు. ముఖ్యంగా క్లోజ్డ్ ఎండెడ్ ఈక్విటీ స్కీముల విక్రయాలకు డిస్ట్రిబ్యూటర్ కమీషన్ అధికంగా డిమాండ్ చేస్తున్నట్లు మార్కెట్ వర్గాల్లో వినికిడిగా ఉంది. ఈ తరహా స్కీములు గత సంవత్సరం ఊపందకున్నాయి. 2017-18 సంవత్సరం సుమారు రూ.5000 కోట్ల పెట్టుబడులు ఈ స్కీముల ద్వారా సేకరించారు. ఈ స్కీముల్లో సుమారు 80 శాతం పెరుగుదల నమోదు జరిగింది.

ఈ నేపథ్యంలో ఎఎంఎఫ్ఐ తన మార్గదర్శకాలను మరింత కఠినతరం చేయడంతో పాటు సెబీ సైతం ఇందులో జోక్యం చేసుకొని డిస్ట్రిబ్యూటర్ కమీషన్లను నియంత్రించాల్సిందిగా ఎంఎఫ్ సంస్థలు కోరుతున్నాయి. ముఖ్యంగా కమీషన్ల మోజులో మదుపరులకు ఏవి పడితే ఆ స్కీములను అంటగట్టడం ద్వారా ఇండస్ట్రీకి దెబ్బ పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.Most Popular