అందరూ భయపడ్తున్నప్పుడు ఈ స్టాక్స్ కొనుక్కోండి 

అందరూ భయపడ్తున్నప్పుడు ఈ స్టాక్స్ కొనుక్కోండి 

 స్టాక్ మార్కెట్లో అందరూ లాభాల కోసం వెంటబడ్తున్నప్పుడు మీరు దూరం జరగండి. అందరూ భయంతో పారిపోతున్నప్పుడు మీరు అడుగుపెట్టండి  అనే మాటను వారెన్ బఫెట్ పదే పదే అనేక సందర్భాల్లో చెప్పారు. మార్కెట్లో కొద్దోగొప్ప అనుభవం ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ మాటను వినే ఉంటారు. 

ప్రస్తుతం మార్కెట్లో అదే ట్రెండ్ నడుస్తోంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ దెబ్బకు అందరూ ఠారెత్తిపారిపోతున్నారు. ఆల్ఫా, బీటాల సంగతిని పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. అయితే మంచి పోర్ట్‌ఫోలియోను నిర్మించుకునేందుకు ఇదో అద్భుత అవకాశమని చెబ్తున్నారు నిపుణులు. అలాంటి పోర్ట్‌ఫోలియోలో ఎలాంటి స్టాక్స్ ఉండాలనే విషయాన్ని కూడా వివరిస్తున్నారు. 2019లో ట్రేడ్ వార్, క్రూడాయిల్ ధరల పెరుగుదల, సాధారణ ఎన్నికలు వంటివి స్పీడ్ బ్రేకర్‌గా కనిపిస్తున్నాయి. 

మంచి స్టాక్స్‌ను మంచి వేల్యుయేషన్స్‌లో కొనేందుకు ఇలాంటి మార్కెట్లు అవకాశాన్ని కల్పిస్తాయి. అయితే డేగ కళ్లతో వాటిని పట్టుకోవాలి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 2015-2017 మధ్య 50 నుంచి 70 శాతం పెరిగాయి. ఇక చాలా స్టాక్స్ మల్టీబ్యాగర్స్ అయిపోయాయి. వాటి ధరలతో పోలిస్తే కొన్ని స్టాక్స్ ఏకంగా 2018లో 90 శాతం కూడా పడిపోవడాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం అలాంటి స్టాక్స్‌ను గుర్తించి పోర్ట్‌ఫోలియోలో పెట్టుకోవాలి. ఆల్ఫా స్టాక్స్‌ను పట్టుకోగలిగితే తిరుగుండదు. అయితే క్వాలిటీలేని స్టాక్స్ జోలికి మాత్రం ఎలాంటి స్థితిలోనూ వెళ్లొద్దు. 

''చిన్న, మధ్య తరహా సంస్థలు పెద్ద వాటి కంటే వేగంగా వృద్ధి చెందుతాయి. స్టాక్స్ రీసెర్చ్, బ్యాలెన్స్ షీట్ రీడింగ్‌లో మీకు మంచి పట్టు ఉండే కలిసొస్తుంది. అప్పుడే ఆల్ఫా స్టాక్స్‌ను గుర్తించవచ్చు. పెరిగే సత్తా ఉండి, అవకాశాన్ని బట్టి ఏ టైంలో అయినా ఎగ్జిట్ అయ్యే స్టాక్స్‌ను ఇప్పుడు కూడా గుర్తించవచ్చు. అవకాశాలు ఎప్పుడైనా ఉంటాయి, వాటిని మనం ఎప్పుడు, ఎలా, ఏ ధరలో తీసుకున్నామనేదే ముఖ్యం'' - సునీల్ సింఘానియా, అబ్బాకస్ అసెట్ మేనేజర్ ఫౌండర్. 

ఆల్ఫా స్టాక్స్ అంటే - బెంచ్ మార్క్ ఇండెక్స్‌తో పోలిస్తే సదరు స్టాక్ ఎంత మెరుగైన పనితీరును కనబర్చిందో చెప్పడాన్ని ఆల్ఫాతో కొలుస్తాం. ఇండెక్స్ కంటే ఎంత ఎక్కువ రిటర్న్ ఇస్తే అంత ఆల్ఫా ఎక్కువ ఉందని అర్థం. 

''కార్పొరేట్ బ్యాంక్స్‌లో ఇంకా చాలా పొటెన్షియల్ కనిపిస్తోంది. రాబోయే మూడేళ్లలో ఇవి మరింతగా వృద్ధి చెందే ఆస్కారం ఉంది. అయితే రాబోయే నాలుగైదు క్వార్టర్లలో పనితీరు అంతంతమాత్రంగా ఉన్నా అవకాశాలు పుష్కలం'' - మనీష్ గున్వానీ, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ - రిలయన్స్  మ్యూచువల్ ఫండ్. 

ఈ ఏడాది ఐసిఐసిఐ బ్యాంకును పక్కనబెడితే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 33 శాతం, కొటక్ బ్యాంక్ 11 శాతం పెరిగింది. వీటిల్లో ఆల్ఫా ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో సెన్సెక్స్ ఇచ్చిన రిటర్న్ కేవలం 5 శాతం మాత్రమే అంటారు మనీష్ గున్వానీ. 

ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్‌లో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కొటక్ బ్యాంకుల్లో ఆల్ఫా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కాన్ఫిడెంట్‌గా చెబ్తున్నారు ఎలారా క్యాపిటల్ ఎండి హరేంద్ర కుమార్. 
ఇన్ఫ్రా, ఫార్మా, లాజిస్టిక్స్‌ రంగాలు కూడా రాబోయే కాలంలో మంచి లాభాలను ఇవ్వొచ్చు. 

చాలా లాజిస్టిక్ సంస్థలు ఈ మధ్య నష్టాలనే మిగిల్చాయి. అయితే జీఎస్టీ అమలు తర్వాత ఇంటర్ స్టేట్ ఆయిల్ క్యారియర్, ఎయిగిస్ లాజిస్టిక్స్, ప్రైమ్ కస్టమర్ సర్వీసెస్, విఆర్ఎల్ లాజిస్టిక్స్ వంటి స్టాక్స్ 60 శాతం వరకూ పెరిగాయి. 

ఆటో, ఆటో యాన్సిలరీ స్పేస్‌లోనూ చాలా పొటెన్షియల్ కనిపిస్తోంది అంటారు ఐఐఎఫ్ఎల్ రీసెర్చ్ ప్రెసిడెంట్ అభిమన్యు సోఫత్. మంచి ఆల్ఫా క్రియేషన్ జరగొచ్చని సూచిస్తున్నారు. కొద్దిగా రామెటీరియల్ ధరలు పెరగడం ఇబ్బందిపెడ్తున్నా ఫర్వాలేదు. ఆటో స్పేస్‌లో హీరోమోటోకార్ప్ బెస్ట్ పిక్ అవుతుంది అంటున్నారు అభిమన్యు. 

(నోట్ - ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. స్టాక్ రికమెండేషన్స్ కావు)


 Most Popular