తొలుత లాభాల దౌడు- చివర్లో మళ్లీ వెనకడుగు!

తొలుత లాభాల దౌడు- చివర్లో మళ్లీ వెనకడుగు!

ప్రపంచ సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. అయితే యథావిధిగా చివర్లో చతికిలపడ్డాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్‌ 47 పాయింట్ల స్వల్ప లాభంతో 35,739 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 14 పాయింట్ల నామమాత్ర వృద్ధితో 10,857 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్ఈలో ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్‌, ఐటీ రంగాలు 1.5 శాతం జంప్‌చేయగా.. ఐటీ 1 శాతం పుంజుకుంది. అయితే ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ రంగాలు 0.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నిఫ్టీ ఇంట్రాడేలో 10,893 వరకూ జంప్‌చేయగా.. సెన్సెక్స్‌ 35,877 వద్ద గరిష్టానికి చేరింది. 
దిగ్గజాలు ఇలా
నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్‌, సిప్లా, టీసీఎస్‌, హిందాల్కో, లుపిన్‌, టైటన్‌, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ 3-1.2 శాతం మధ్య ఎగశాయి. అయితే మరోవైపు టాటా స్టీల్‌, జీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, వేదాంతా, హెచ్‌పీసీఎల్‌, ఐటీసీ, ఐబీ హౌసింగ్‌ 2-1 శాతం మధ్య క్షీణించాయి.
చిన్న షేర్లు వీక్‌
బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.5 శాతం నీరసించింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1383 నష్టపోగా.. 1294 లాభపడి ముగిశాయి.
ఎఫ్‌ఫీఐల అమ్మకాలు- డీఐఐల పెట్టుబడులు!
నగదు విభాగంలో మంగళవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1169 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా..  ఇందుకు ధీటుగా దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1327 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1157 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా..  దేశీ ఫండ్స్‌ దాదాపు రూ. 1063 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. Most Popular