పాతికేళ్ల బంగారుబాతు ఇన్ఫోసిస్..

పాతికేళ్ల బంగారుబాతు ఇన్ఫోసిస్..

భారతదేశంలో అతి పెద్ద ఐటి కంపెనీల్లో ఒకటిగా వెలుగొందుతున్న 'ఇన్పోసిస్' సరిగ్గా పాతికేళ్ల క్రితం ఐపీవోగా 14 జూన్ 1993లో లిస్టింగ్ అయ్యింది. భారతీయ టెక్నాలజీ రంగంలో అంచెలంచెలుగా ఎవరెస్టు ఎత్తుకు ఎదిగిన ఇన్ఫోసిస్ మదుపరుల పాలిట ఒక బంగారుబాతు లాంటిది. పాతికేళ్ల క్రితం మార్కెట్‌కు వచ్చిన ఇన్ఫోసిస్‌ కంపెనీ షేర్లు కొనుగోలు చేసి అట్టిపెట్టుకున్న మదుపరులు ఇపుడు కోటీశ్వరులు.

ఐటీ రంగంలో దూసుకెళ్తున్న ఇన్ఫోసిస్‌ అటు న్యూయార్క్‌లోని నాస్‌డాక్‌ లోనూ 1999 లో లిస్టైన ఇన్ఫోసిస్‌ తొలి భారతీయ సంస్థగా రికార్డు నెలకొల్పింది. కాగా దేశీయ మార్కెట్‌ లోని బాంబే స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లో లిస్టైన సంస్థలలో ఇన్ఫోసిస్‌ విలువ ప్రస్తుతం రూ.2,78,443 కోట్లుగా ఉంది. అలాగే కేవలం 25 ఏళ్ళ క్రితం రూ. 95తో మొదలైన ఇన్ఫోసిస్‌ షేర్‌ విలువ ప్రస్తుతం రూ.1275 వద్ద కదలాడుతోంది. 

భారతదేశ టెక్నాలజీ నిపుణులను ప్రపంచ స్దాయిలో అందిస్తూ అనతి కాలంలో మంచి పేరు తెచ్చుకున్న ఇన్ఫోసిస్ జూలై 2, 1981న పూణేలో నారాయణ మూర్తి తో పాటు నందన్ నిలేకని, రాఘవన్, క్రిస్ గోపాలక్రిష్ణన్, షిబులాల్, దినేష్, అశోక్ అరోరాలు స్థాపించారు. ఇన్ఫోసిస్ మొదటి పెట్టుబడి ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. నారాయణ మూర్తి ఆయన భార్య సుధా మూర్తి వద్ద నుంచి రూ 10,000 అప్పుగా తీసుకొని ఇన్ఫోసిస్ స్థాపించారు.

మొదట సంస్థను సంయుక్తంగా "ఇన్ఫోసిస్ కన్సల్టంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ "గా నామకరణం చేయగా. పూణే ఉత్తర మధ్య భాగంలో ఉన్న మోడల్ కాలనీ లోని రాఘవన్ ఇంటిని రిజిస్టర్డ్  కార్యాలయంగా ఉపయోగించారు. ఆ తర్వాత 1982లో ఇన్ఫోసిస్‌ని బెంగుళూరులో ప్రారంభించారు అదే ఆ తర్వాత ప్రధాన కార్యాలయంగా మారింది.

ఇన్పోసిస్‌కి ప్రస్తుతం భారతదేశంలో 9 డెవెలప్మెంట్ సెంటర్లు మరియు ఇతర దేశాల్లో 34 కార్యాలయాలు ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద ఐటి సంస్థల్లో ప్రస్తుతం సుమారుగా 2 లక్షలకు పైగా మంది నిపుణులను కలిగి ఉంది. దీని కార్యాలయాలు 22 దేశాలలో ఉన్నాయి అలాగే అభివృద్ధి కేంద్రాలు భారతదేశం, చైనా, ఆస్ట్రేలియా, లండన్, కెనడా మరియు జపాన్ లో ఉన్నాయి.

ఐపీవో నుంచి మార్కెట్ లీడర్ వరకూ ప్రస్థానం..
ఇన్ఫోసిస్ స్టాక్ మార్కెట్లలో అరేంగట్రం చేసే సంవత్సరం ముందే, 1992లో సెబీని స్థాపించారు. అంతకు మునుపే హర్షద్ మెహతా కుంభకోణం నుంచి మార్కెట్లు కోలుకుంటున్నాయి. సరిగ్గా ఈ నేపథ్యంలోనే ఇన్ఫోసిస్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 

ఇన్ఫోసిస్ స్టాక్ మార్కెట్లలోకి 1993వ సంవత్సరంలో వెళ్ళగా, మొదట్లో ఇన్ఫోసిస్ IPO అండ్ సబ్ స్క్రయిబ్ అయ్యింది.  కానీ యుఎస్ పెట్టుబడి బ్యాంకు మోర్గాన్ స్టాన్లీ  ఒక్కో వాటాకు రూ. 95 చెల్లించి 13% ఈక్విటీ తీసుకుంది. లిస్టింగ్ రోజు ఇన్ఫోసిస్ రూ.145 వద్ద లిస్ట్ అయ్యంది. సరిగ్గా ఆరు సంవత్సరాలు అంటే 1999 నాటికి ఇన్ఫీ షేర్ ధర  8,100 రూపాయిలకు చేరింది. దాదాపు 85 రెట్లు పెరిగింది. ఆ సమయంలో మార్కెట్ లో అతి విలువైన షేరుగా ఇన్ఫోసిస్ పేరు పొందింది. ఆ సమయంలో, ఇన్ఫోసిస్ నాస్ డాక్‌లో 20 అతిపెద్ద సంస్థలలో ఒకటైన అడోబ్ సిస్టమ్స్, నోవెల్, లికోస్ కన్నా చాలా ముందంజలో ఉంది.

ఫోర్బ్స్ పత్రిక కథనం ప్రకారం, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్‌లో జాబితా కాబడినప్పటి నుండీ 2000సంవత్సరం వరకు, ఇన్ఫోసిస్ రెవన్యూలు కలిపి సంవత్సరానికి 70శాతం పైనే ఉన్నాయి. 2000 సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఐటీ రంగంలో సాధిస్తున్న భారతీయ అద్భుతంగా ఇన్ఫోసిస్ ని పేర్కొన్నారు. ఏప్రిల్ 2009లో, ఫోర్బ్స్ ఇన్ఫోసిస్ ను ప్రపంచంలోని సాఫ్ట్ వేర్ మరియు సేవల రంగాలలో పని చేస్తున్న ఉత్తమ 5 సంస్థలలో ఒకటిగా పేర్కోంది.

ఇన్ఫోసిస్‌కి సిఈఓగా పనిచేసినవారు, అప్పట్లో పెట్టుబడి పెడితే ఇప్పుడే స్థాయిలో ఉండేది తదితర వివరాలు ఈ కింది ఫోటోలో చూడవచ్చు



Most Popular