ఇక ఫెడ్‌పై దృష్టి- రేటింగ్‌తో ట్విటర్‌ కేక?!

ఇక ఫెడ్‌పై దృష్టి- రేటింగ్‌తో ట్విటర్‌ కేక?!

ఉత్తర కొరియా నేత కిమ్‌ జాంగ్‌తో అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ సింగపూర్‌లో నిర్వహించిన సమావేశం విజయవంతంగా ముగిసినప్పటికీ మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు ఎక్కడివక్కడే అన్నట్లుగా ముగిశాయి. డోజోన్స్‌ నామమాత్రంగా 1 పాయింట్‌ వెనకడుగుతో 25,321 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 5 పాయింట్లు(0.2 శాతం) పుంజుకుని 2,787 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ మాత్రం 44 పాయింట్లు(0.6 శాతం) ఎగసి 7,704 వద్ద స్థిరపడింది. జేపీ మోర్గాన్‌ అప్‌గ్రేడ్‌ చేయడంతో ట్విటర్‌ 5 శాతం జంప్‌చేసింది. ఇది నాస్‌డాక్‌కు బలాన్నిచ్చింది. కాగా.. నేడు కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్ష నిర్ణయాలను ప్రకటించనున్న నేపథ్యంలో ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. 
ఏటీఅండ్‌టీకి రిలీఫ్‌
హెచ్‌బీవో, వార్నర్‌ బ్రదర్స్‌, సీఎన్‌ఎన్‌ బ్రాండ్లు కలిగిన టైమ్‌ వార్నర్‌ గ్రూప్‌ కొనుగోలుకి టెలికం దిగ్గజం ఏటీఅండ్‌టీకి తాజాగా యూఎస్‌ జిల్లా కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఈ డీల్‌ వల్ల పోటీకి తెరపడి వినియోగదారులు నష్టపోయే అవకాశముందన్న అంచనాతో అమెరికా న్యాయ శాఖ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా.. టైమ్‌ వార్నర్‌ కొనుగోలుకి  85 బిలియన్‌ డాలర్లను ఏటీఅండ్‌టీ వెచ్చించనుంది. కోర్టు తీర్పు మంగళవారం ట్రేడింగ్‌ ముగిశాక వెలువడటంతో నేడు ఈ రెండు కౌంటర్లూ జోరందుకునే వీలుంది. మంగళవారం ఈ కౌంటర్లు నామమాత్ర లాభాలతో ముగిశాయి. కాగా.. మరోపక్క వేల సంఖ్యలో సిబ్బందిని తగ్గించనున్న వార్తలతో ఆటో దిగ్గజం టెస్లా 3 శాతం జంప్‌చేయగా, చార్టర్‌ కమ్యూనికేషన్స్‌ సైతం దాదాపు 3 శాతం ఎగసింది. Most Popular