ప్రతికూలంగా ప్రారంభంకావచ్చు నేడు?!

ప్రతికూలంగా ప్రారంభంకావచ్చు నేడు?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 25 పాయింట్ల క్షీణతతో 10,822 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఉత్తర కొరియా నేత కిమ్‌ జాంగ్‌తో అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ సింగపూర్‌లో నిర్వహించిన సమావేశం విజయవంతంగా ముగిసినప్పటికీ మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఇక దేశీయంగా ఏప్రిల్‌లో పారిశ్రామికోత్పత్తి 4.9 శాతానికి పుంజుకోగా... మేలో వినియోగ ధరల ద్రవ్యోల్బణం సైతం 4.9 శాతానికి ఎగసింది. దీంతో కొంతమేర సెంటిమెంటు బలహీనపడే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మంగళవారం ఆద్యంతం ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో సెన్సెక్స్‌ 209 పాయింట్లు జంప్‌చేసి 35,692 వద్ద నిలవగా.. నిఫ్టీ 56 పాయింట్లు జమ చేసుకుని 10,843 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ కదలికలు ఇలా..! 
నేడు నిఫ్టీ బలహీనపడితే తొలుత 10,803 పాయింట్ల వద్ద, తదుపరి 10,762 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 10,870 పాయింట్ల వద్ద, తదుపరి 10,897 స్థాయిలోనూ రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. 

ఎఫ్‌ఫీఐల అమ్మకాలు- డీఐఐల పెట్టుబడులు!
నగదు విభాగంలో మంగళవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1169 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా..  ఇందుకు ధీటుగా దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1327 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1157 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా..  దేశీ ఫండ్స్‌ దాదాపు రూ. 1063 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

 Most Popular