షియోమీ డీల్‌తో డిక్సన్ లాభపడుతుందా..! డిక్సన్ టెక్నాలజీస్ బలాబలాలేంటి? ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్

షియోమీ డీల్‌తో డిక్సన్ లాభపడుతుందా..! డిక్సన్ టెక్నాలజీస్ బలాబలాలేంటి? ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్

స్మార్ట్ ఫోన్ల రంగంలో కింగ్ లాంటి షియోమీ..టీవిలు విక్రయాలు ప్రారంభించింది. ఐతే ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌తో పాటు తన ఉత్పత్తి వ్యయం తగ్గించుకునేందుకు కూడా స్థానికంగా మన దేశంలోనే టీవిలు తయారు చేయనుంది. ఇది స్టాక్ మార్కెట్‌లో లిస్టైన కంపెనీ డిక్సన్ టెక్నాలజీస్‌తో కావడంతో ఇన్వెస్టర్ల చూపు ఆ స్టాక్‌పై మరలింది.

షేరు జూమ్‌
గతేడాది సెప్టెంబర్‌లో రూ. 1766 ధరలో ఐపీవోకు వచ్చిన డిక్సన్‌ టెక్నాలజీస్‌ 64 శాతం లాభంతో రూ.  2725 వద్ద లిస్టయ్యింది. అప్పటినుంచీ ర్యాలీ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ. 3210 వద్ద ట్రేడవుతోంది.

డిక్సన్ టెక్నాలజీస్ ఎలక్ట్రకిల్స్ రంగంలో టివీ సెట్ల తయారీలో వ్యాపారం చేస్తోన్న సంస్థ..ఈ సంస్థతో టైఅప్ అవడం ద్వారా షియోమీ మంచి అమ్మకాలు ఆశిస్తోంది. నెలకు 55వేల టీవిసెట్లు తయారు చేసేందుకు ఈ ఒప్పందం కుదిరింది. షియోమీ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌తో తిరుపతి ప్లాంట్‌లో ఎంఐ బ్రాండ్ పేరుతో ఆగస్ట్‌లో ఇలా విక్రయాలు ఆరంభించనుంది. 32 అంగుళాల, 43 అంగుళాలు రెండు సైజుల్లో ఈ విక్రయాలు జరగనున్నాయ్. షియోమీ ఇప్పటికే ఫాక్స్‌కాన్‌తొ కలిసి ఈ టివీలు తయారు చేస్తున్నా..స్థానికంగా తయారు చేయడం మాత్రం ఇదే ప్రథమం అవుతుంది. అందుకే లోకల్ పార్ట్‌నర్‌గా డిక్సన్ టెక్నాలజీస్‌ని ఎన్నుకోవడం అటు ఆ కంపెనీకి ఇటు డిక్సన్ టెక్నాలజీస్‌కి మంచి బూస్ట్ అయ్యే సూచనలు కన్పిస్తున్నాయ్. ఈ డీల్ డిక్సన్ టెక్నాలజీస్‌కి ఎలా లాభం తెచ్చిపెడుతుందో చూద్దాం

దాదాపు 3730కోట్ల రూపాయల మార్కెట్ కేపిటలైజేషన్ కలిగిన డిక్సన్ టెక్నాలజీస్ మార్చితో ముగిసిన క్వార్టర్లో 534కోట్ల అమ్మకాలతో 13కోట్ల 57లక్షల నికరలాభం ఆర్జించింది. గత ఏడాదే లిస్టింగ్‌కి వచ్చిన డిక్సన్ టెక్నాలజీస్ లైటింగ్, మొబైల్ ఫోన్ల తయారీ చేస్తుంటుంది. పాత కస్టమర్లని నిలబెట్టుకోవడంతోపాటు కొత్త క్లయింట్లను రాబట్టడంలో మంచి ప్రగతి సాధిస్తోంది. డెహ్రాడూన్‌లో ఈ సంస్థకి తయారీ కేంద్రం ఉండగా, తిరుపతి ప్లాంట్‌కి తరలించారు. పానాసోనిక్ ఎలక్ట్రానిక్ మేన్యుఫేక్చరింగ్ సర్వీస్ నుంచి డిక్సన్ టెక్నాలజీస్‌కు ఎక్కువ ఆదాయం వస్తోంది

డిక్సన్ టెక్నాలజీస్ క్లయింట్ల విషయానికి వస్తే, లైటింగ్ ఉత్పత్తుల్లో క్రాంప్టన్ గ్రీవ్స్, విప్రో, పానాసోనిక్, యాంకర్, ఫిలిప్స్ వంటి అగ్రగామి సంస్థలు ఉన్నాయి. అలానే హోమ్ అప్లయెన్సెస్ అంటే గృహోపకరణాల విషయంలో వాషింగ్ మెషీన్లను ఏడాదికి 10లక్షలను తయారు చేయగలుగుతుంది. కంపెనీకి ఈ రంగంలో భారీ ఆర్డర్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో 80-85శాతం వరకూ ఇంకా ఉత్పాదన పెరుగుతుందని కంపెనీ చెప్తోంది. డిక్సన్ టెక్నాలజీస్ కాస్త ఇబ్బంది ఎదుర్కొంటున్న రంగం ఏదైనా ఉందంటే అది మొబైల్ ఫోన్ల విషయంలోనే ఉత్పత్తి చేసినవాటిలో విక్రయాలు అవుతున్నవి తక్కువ. ఐతే గియోనీ ఏప్రిల్ నుంచి తిరిగి అమ్మకాలపై దృష్టి పెట్టడంతో పరిస్ధితి మెరుగుపడవచ్చు. డిక్సన్ టెక్నాలజీస్ క్యు4లో టాంబో అనే కొత్త క్లయింట్ యాడ్ అవడం కూడా ఓ ప్లస్ పాయింట్

వీటితో పాటు డిక్సన్ ఇప్పుడు సెక్యూరిటీ సిస్టమ్స్ రంగంలోకి ప్రవేశించి..క్లోజ్డ్ సర్క్యూట్స్ టివిలు, డిజిటల్ వీడియో రికార్డర్లు తయారు చేస్తోంది. ఈ రంగంలో ఉన్న మంచి డిమాండ్‌ని అందిపుచ్చుకునేందుకు లక్షయూనిట్ల సామర్ద్యాన్ని 4లక్షల యూనిట్లకు పెంచే ప్రణాళికలు రచించింది. ఇవన్నీ డిక్సన్ టెక్నాలజీస్ సమర్ధత, లాభదాయకతకు నిదర్శనంగా చెప్తుండగా..జిఎస్టీ రూపంలో ఎక్కువ పన్ను శ్లాబులో ఉండటం ప్రతికూల అంశం

 Most Popular