అవంతీ ఫీడ్స్‌కు బోనస్‌ ఫీడ్‌-షేర్ల విభజన కూడా!

అవంతీ ఫీడ్స్‌కు బోనస్‌ ఫీడ్‌-షేర్ల విభజన కూడా!

వాటాదారులకు బోనస్‌ షేర్ల జారీ, షేర్ల ముఖ విలువ విభజన అంశాలను తెరమీదకు తీసుకురావడంతో అవంతీ ఫీడ్స్‌ కౌంటర్‌ తాజాగా జోరందుకుంది. 
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 1935 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 8 శాతం ఎగసి రూ. 1980కు చేరింది. రొయ్యల ఎగుమతులు మందగించడం, ధరలు తగ్గడం వంటి ప్రతికూల అంశాల కారణంగా ఇటీవల పతనబాట పట్టిన అవంతీ ఫీడ్స్‌ షేరు గత నాలుగు రోజులుగా తిరిగి ర్యాలీ చేస్తున్న విషయం విదితమే. 

1:2 రేషియో
రూ. 2 ముఖ విలువగల షేరుని రూ. 1 ముఖ విలువగల 2 షేర్లుగా(2:1 నిష్పత్తి) విభజించేందుకు ప్రతిపాదించినట్లు అవంతీ ఫీడ్స్‌ తాజాగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. ఇందుకు ఈ నెల 14న అసాధారణ బోర్డు సమావేశాన్ని(ఈజీఎం) ఏర్పాటు చేసినట్లు తెలియజేసింది. అంతేకాకుండా వాటాదారుల దగ్గరున్న ప్రతీ 2 షేర్లకూ 1 షేరుని(1:2 రేషియో) బోనస్‌గా జారీ చేసేందుకు ప్రతిపాదించినట్లు వెల్లడించింది. 

షేరు రోలర్‌ కోస్టర్‌ బాట
విదేశాలలో రొయ్యల ధరలు క్షీణించడం, డిమాండ్‌ మందగించడం వంటి వార్తల నేపథ్యంలో అవంతీ ఫీడ్స్‌ షేరు మే 25 నుంచి జూన్‌ 5 వరకూ పతనబాటలో సాగింది. రూ. 1951 స్థాయి నుంచి రూ. 1354 వరకూ జారింది. ఇది 31 శాతం క్షీణతకాగా.. ఈ నెల 5న రూ. 1232 వద్ద ఇంట్రాడేలో 52 వారాల కనిష్టాన్ని తాకిందికూడా. ఆపై తిరిగి జోరందుకుని గత నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో 46 శాతం దూసుకెళ్లింది. తాజాగా రూ. 1935కు చేరింది. కాగా.. అవంతీ ఫీడ్స్‌ షేరు 2017 నవంబర్‌ 13న రూ. 3,000 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ఈ స్థాయి నుంచి చూస్తే ఇప్పటివరకూ 34 శాతం పతనమైంది.

క్యూ3 వీక్‌
అవంతీ ఫీడ్స్‌ గతేడాది చివరి త్రైమాసికం(క్యూ4లో) నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 3 శాతం క్షీణించి రూ. 86 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 4.4 శాతం బలహీనపడి 15.9 శాతానికి చేరాయి. గత నాలుగు క్వార్టర్లలో ఇబిటా మార్జిన్లు 20-24 శాతం మధ్య నమోదవుతూ వచ్చాయి.Most Popular