ఈ వారం కేంద్ర బ్యాంకులపై మార్కెట్‌ కన్ను!

ఈ వారం కేంద్ర బ్యాంకులపై మార్కెట్‌ కన్ను!

వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లపై పలు దేశ, విదేశీ పరిణామాలు ప్రభావం చూపే అవకాశముంది. దేశీయంగా ఆర్థిక గణాంకాలు వెలువడనుండగా.. అంతర్జాతీయ స్థాయిలో పలు కేంద్ర బ్యాంకులు పరపతి విధాన సమీక్షలు ప్రకటించనున్నాయి. వీటికితోడు రుతు పవనాల విస్తరణ, ఇటీవల దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే కట్టుబడుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) తీరు, ధాటిగా ఇన్వెస్ట్‌ చేస్తున్న దేశీ ఫండ్స్‌ పెట్టుబడులు వంటి అంశాలకు సైతం ప్రాధాన్యం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

మంగళవారం నుంచీ షురూ
మంగళవారం(12న) ప్రభుత్వం ఏప్రిల్‌ నెలకు పారిశ్రామికోత్తత్పి సూచీ(ఐఐపీ) వివరాలు ప్రకటించనుంది. మార్చిలో ఐఐపీ 4.4 శాతం ప్రగతి చూపింది. ఈ బాటలో గురువారం(14న) మే నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. ఏప్రిల్‌లో డబ్ల్యూపీఐ 3.18 శాతం పెరిగింది. వీటితోపాటు ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయగలవని విశ్లేషకులు చెబుతున్నారు.

జీ7 మీట్‌...
సింగపూర్‌లో 12న నిర్వహిస్తున్న సదస్సులో అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఉత్తర కొరియానేత కిమ్‌ జాంగ్‌తో సమావేశంకానున్నారు. చరిత్రాత్మకమైన ఈ సదస్సులో అణు కార్యక్రమాలకు కొరియా వీడ్కోలు చెప్పే అంశంపై చర్చించనున్నారు. మరోవైపు శుక్రవారం(8న) క్యూబెక్‌లో ప్రారంభమైన జీ7 దేశాల సమావేశాలపైనా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు కన్నేయనున్నాయి. నిజానికి ఉక్రెయిన్‌లో క్రిమియా ప్రాంత సమస్యల కారణంగా గతంలో జీ8 నుంచి రష్యాను తొలగించారు. రష్యాను తిరిగి చేర్చుకోవాలంటూ ట్రంప్‌ తాజాగా సూచించడం, కెనడా, మెక్సికో, ఫ్రాన్స్‌ తదితర దేశాలు అమెరికా విధించిన స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తులపై టారిఫ్‌లను వ్యతిరేకించడం వంటి అంశాలు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఫెడ్‌ పాలసీ సమీక్ష...
13న అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రెండు రోజుల పాలసీ సమావేశాలు ముగియనున్నాయి. దీంతో ఫెడ్‌ పరపతి నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈసారి ఫెడ్‌ కనీసం పావు శాతం వడ్డీ రేట్లను పెంచే అవకాశమున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 1.5-1.75 శాతంగా అమలవుతున్నాయి. మే నెలలో యథాతథ పాలసీ అమలుకే కట్టుబడటంతో ఈసారి వడ్డీ రేటు పెంచే వీలున్నట్లు భావిస్తున్నారు.
ఈసీబీ, బీవోజే సైతం
14న యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌(ఈసీబీ) పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. యూరోజోన్‌ అభివృద్దికి అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలకు ఈసీబీ మంగళంపాడనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఇక బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌(బీవోజే) సైతం 15న పాలసీ నిర్ణయాలు వెల్లడించనుంది. దీంతో వచ్చే వారం ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌కు పలు పరిణామాలు కీలకంగా నిలవనున్నాయి. Most Popular