మల్టీబ్యాగర్స్ కోసం వేటా ? ఇలా ట్రై చేసి చూడండి!

మల్టీబ్యాగర్స్ కోసం వేటా ? ఇలా ట్రై చేసి చూడండి!

ప్రతీ ఒక్క ఇన్వెస్టర్ ఓ మల్టీ బ్యాగర్ స్టాక్ పట్టుకోవాలని చూస్తారు. జీవితంలో స్థిరపడిపోయేలాంటి స్టాక్ ఒక్కటి స్పాట్ చేస్తే చాలు అనుకుంటారు. కానీ అలాంటివి నూటికో, కోటికో ఎప్పుడో ఒక్కటి దొరకవచ్చు. అలా ఒకవేళ మనం సరైన స్టాక్‌ను పట్టుకోగలిగినా.. నాలుగు రూపాయలు లాభాలు వచ్చే సరికి ఉత్సాహం ఆపుకోలేని పరిస్థితి. దాన్ని అమ్మేంత వరకూ నిద్రపట్టదు. ఆ స్టాక్‌ మల్టీబ్యాగర్ అయ్యేవరకూ వేచిఉండే ఓపిక మనకు ఉండదు. ఇది సరే.. అసలు ఏదైనా ఓ మల్టీబ్యాగర్‌ స్టాక్‌ను ఎలా పిక్ చేసుకోవాలి అనే ప్రాథమిక అంశాన్ని చూద్దాం. 

కంపెనీ మార్కెట్ లీడరా.. కాదా..
ఇది ప్రధానంగా చూడాల్సిన అంశం. ఈ బేసిక్ ప్రిన్సిపుల్‌ మొదట గుర్తుంచుకోవాలి. చిన్నదైనా, పెద్దదైనా సదరు సంస్థ మార్కెట్‌లో మంచి పట్టుసాధించిందై ఉండాలి. వీళ్ల ఫోకస్ మారకూడదు. ఏటికేడు ఆదాయం, మార్కెట్ వాటా పెరుగుతూనే ఉండాలి. 

వృద్ధికి అవకాశం ఎంత
ఎంచుకున్న కంపెనీకి మెరుగైన భవిష్యత్తు కనపడాలి. వృద్ధికి మంచి అవకాశాలు ఉండాలి. వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి స్కోప్ ఉండాలి. 

అప్పు ఉన్నా ఫర్లేదు.. కానీ
అప్పు లేనిదే ఏ వ్యాపారమూ నడవదు. కానీ అది అతి కాకూడదు. కంఫర్ట్ జోన్‌లో ఉన్నంత వరకూ అప్పుతో ముప్పేమీ లేదు. అప్పు తీసుకోవాలి, దాన్ని పర్ఫెక్ట్‌గా ఉపయోగించుకోవాలి, మళ్లీ తీర్చేయాలి, వృద్ధి చెందాలి.. అదే ఏ కంపెనీకైనా సక్సెస్ సీక్రెట్. అయితే ఒక స్థాయికి వచ్చిన తర్వాత.. పదే పదే అప్పు చేస్తూ, ఈక్విటీ పెంచుకుంటూ వెళ్తే మాత్రం అదో నెగిటివ్ సైన్. 

ప్రమోటర్‌పై నమ్మకం 
నలుగురిలో నారాయణలా కాకుండా ప్రమోటర్‌కు విలువలు ఉండాలి. అడ్డగోలు నిర్ణయాలు, అనాలోచిత చర్యలు, ఫ్రాడ్స్‌కు దూరంగా ఉన్నవాళ్లే రేపటి మన హీరోలు. అందుకే మంచి ప్రమోటర్ ఉన్న కంపెనీకే ఫ్యూచర్.

నెంబర్స్ సహకరించాలి
పైవన్నీ ఓకే అనుకున్న తర్వాత నెంబర్స్ కూడా అందుకు దోహదపడాలి. రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్‌ వంటి నెంబర్స్ పటిష్టంగా ఉండాలి. 

స్టాక్ వేల్యుయేషన్
ఎంత మంచి స్టాక్ అయినా వేల్యుయేషన్‌ తక్కువలో ఉండాలి. అంటే స్టాక్ రీజనబుల్ ప్రైస్‌లో దొరకాలి. దాన్నే మనం పీఈ అంటాం. తక్కువ పీఈలో దొరికే స్టాక్‌ను మనం పట్టుకోవాలి. స్థిరమైన ఆదాయాన్ని కూడా అందిస్తూ ఉండాలి. 

చివరగా...
అతిగా ఆలోచించొద్దు. కనిపించే నంబర్స్‌ను కొద్దోగొప్పో నమ్మొచ్చు. గత కొన్నేళ్ల రెవెన్యూ, ఎబిటా నెంబర్లను పరిశీలించి పనితీరు అర్థం చేసుకోవచ్చు. తద్వారా నిర్వాహణా సామర్ధ్యం కూడా అవగతమవుతుంది. వేల్యుయేషన్ తక్కువగా ఉండి, ఎర్నింగ్స్ స్థిరంగా.. కనిపిస్తే.. స్టాక్ పిక్ చేసుకోవచ్చు. 

(ఇవి కొన్ని ప్రాథమిక పారామీటర్స్ మాత్రమే. వీటికి తోడు సెక్టర్ పర్ఫార్మెన్స్‌ను కూడా చూస్తే మంచిది- సాధ్యమైనంత సొంత రీసెర్చ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మేలు చేయగలదు)Most Popular