మళ్లీ పతనమైన రొయ్యల కంపెనీల షేర్లు!

మళ్లీ పతనమైన రొయ్యల కంపెనీల షేర్లు!

గత కొద్ది రోజులుగా రొయ్యల పెంపకం, ఎగుమతులు చేపట్టే సంస్థల షేర్లపట్ల ఇన్వెస్టర్లు విముఖత చూపుతూ వస్తున్నారు. దీంతో అవంతీ ఫీడ్స్‌, వాటర్‌బేస్‌ కౌంటర్లు ఏడాది గరిష్టాల నుంచి చూస్తే..  50 శాతంపైగా పతనమయ్యాయి. ఇక ఇటీవలే లిస్టింగ్‌ పొందిన ఎపెక్స్‌ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌ కౌంటర్‌ సైతం 50 శాతం దిగజారింది. 

నేలచూపులోనే
ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో అవంతీ ఫీడ్స్‌ దాదాపు 6 శాతం క్షీణించి రూ. 1399 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1377 వరకూ జారింది. ఈ కౌంటర్‌ నవంబర్‌ 13న రూ. 2940 వద్ద కొత్త గరిష్టాన్ని అందుకుంది. ఇక ఎపెక్స్‌ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌ కౌంటర్లో అంతా అమ్మేవాళ్లేగానీ కొనుగోలుదారులు లేకపోవడంతో మరోసారి 5 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 477 దిగువన ఫ్రీజయ్యింది. ఈ షేరు డిసెంబర్‌ 7న రూ. 939 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో ప్రస్తుతం ఇక వాటర్‌బేస్‌ షేరు బీఎస్ఈలో 5 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 173 దిగువన ఫ్రీజయ్యింది. ఈ షేరు జనవరి 2న రూ. 417 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. 

కారణమేవిటంటే?
ఇటీవల చేపలు, రొయ్యల ఎగుమతులు క్షీణిస్తూ వస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఫామ్‌గేట్‌ రొయ్యల ధరలు సైతం నీరసిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇదే సమయంలో రొయ్యల మేత ధరలు పెరుగుతూ వస్తున్నట్లు తెలియజేశాయి. దీంతో గత మూడు నెలలుగా సముద్ర ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నట్లు పేర్కొన్నాయి. కాగా.. 2017-18లో 15 శాతం అధికంగా 5.4 లక్షల మెట్రిక్‌ టన్నుల సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేయగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధికి మాత్రమే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. దేశీయంగా ఉత్పత్తి పెరగడం, వాతావరణ మార్పులతో అమెరికా వంటి కీలక మార్కెట్ల నుంచి డిమాండ్‌ తగ్గడం ధరల క్షీణతకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది చాలదన్నట్లు ఇండోనేసియా, వియత్నాం తదితర దేశాలలో ఉత్పత్తి పుంజుకోవడం కూడా దేశీ పరిశ్రమకు సమస్యలు తెచ్చిపెట్టే వీలున్నట్లు వివరించారు. 

తాత్కాలికమే
రొయ్యల ధరలు, ఎగుమతుల్లో క్షీణత తాత్కాలికమేనని అవంతీ ఫీడ్స్‌ యాజమాన్యం గత వారం స్పష్టం చేసింది.  ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొనలేదని ష్రింప్‌ కంపెనీల ప్రతినిధులు వివరిస్తున్నారు. కాగా..  ఈ ఏడాది 60-65 శాతం సామర్థ్యాన్ని వినియోగించుకోగలమన్న ధీమాను అవంతీ ఫీడ్స్‌ యాజమాన్యం ఇప్పటికే వ్యక్తం చేసింది. Most Popular