రెండో రోజూ షాలిమార్‌ పెయింట్స్‌ ర్యాలీ!

రెండో రోజూ షాలిమార్‌ పెయింట్స్‌ ర్యాలీ!

వరుసగా రెండో రోజు షాలిమార్‌ పెయింట్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ ఊపందుకుంది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 7.25 శాతం జంప్‌చేసి రూ. 147 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 151 వరకూ ఎగసింది. కాగా.. గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో గురువారం తొలుత ఈ షేరు రూ. 112 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. తదుపరి కంపెనీలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడుల పరిమితిని ప్రస్తుత 24 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు బోర్డు అంగీకరించడంతో ఈ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ పుట్టి 16 శాతం దూసుకెళ్లింది. చివరికి రూ. 136 వద్ద ముగిసింది. 
క్యూ4లో నష్టం 
క్యూ4(జనవరి-మార్చి)లో  షాలిమార్‌ పెయింట్స్‌ రూ. 16 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2016-17) క్యూ4లో రూ. 13 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం 27 శాతం క్షీణించి రూ. 60 కోట్లకు పరిమితమైంది. Most Popular