సబ్సిడీ సెగ- కుప్పకూలిన చమురు దిగ్గజాలు!

సబ్సిడీ సెగ- కుప్పకూలిన చమురు దిగ్గజాలు!

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు నాలుగేళ్ల గరిష్టాలవద్దే కొనసాగుతున్న నేపథ్యంలో దేశీ చమురు ఉత్పాదక సంస్థలు లాభపడే అవకాశముంది. అయితే ఇటీవల కొంతకాలంగా డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతూరావడం, ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరల పెంపును నిలిపివేయడంతో చమురు ఉత్పాదక కంపెనీలపై సబ్సిడీ చెల్లింపుల భారం పెరగవచ్చన్న ఆందోళనలు పెరిగాయి. 


దిగ్గజాల దిగాలు
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఓఎన్‌జీసీ షేరు 8 శాతం పతనమై రూ. 162 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 155  వద్ద ఏడాది కనిష్టానికి చేరింది. ఇక ఆయిల్‌ ఇండియా షేరు సైతం 10 శాతం కుప్పకూలి రూ. 209 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 204 వరకూ నష్టపోయింది. కాగా.. బుధవారం  ఓఎన్‌జీసీ 5.3 శాతం పతనమై రూ. 175 వద్ద నిలవగా.. ఆయిల్‌ ఇండియా దాదాపు 4 శాతం క్షీణించి రూ. 230 వద్ద స్థిరపడింది.


రూ. 53,000 కోట్లు?
ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రూ. 35000-53,000 కోట్ల మధ్య సబ్సిడీల భారం పడే వీలున్నట్లు గ్లోబల్‌ రేటింగ్‌ దిగ్గజం మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ తాజాగా అంచనా వేసింది. బ్యారల్‌కు 60-80 డాలర్ల మధ్య చమురు ధరలను సబ్సిడీల మదింపునకు మూడీస్‌ లెక్కలోకి తీసుకుంది. అయితే ప్రభుత్వం ఇందుకు బడ్జెట్‌లో రూ. 25,000 కోట్లను మాత్రమే పేర్కొనడం గమనార్హం! వెరసి ద్రవ్యలోటు కారణంగా ప్రభుత్వం సబ్సిడీల భారాన్ని చమురు ఉత్పాదక కంపెనీలు ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాకు బదిలీ చేసే అవకాశమున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.


రిఫైనింగ్‌ కంపెనీలు..
ప్రభుత్వ నిర్ధారిత ధరలలో ఎల్‌పీజీ, కిరోసిన్‌ తదితర పెట్రో ఉత్పత్తులను విక్రయించే చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా సబ్సిడీల చెల్లింపులు చేపట్టే సంగతి తెలిసిందే. ఇందువల్లనే రిఫైనింగ్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రోజువారీ సవరించినప్పటికీ నష్టాలను తలకెత్తుకుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. Most Popular