చివర్లో అమ్మకాల ఊపు- భారీ నష్టాల ముగింపు!

చివర్లో అమ్మకాల ఊపు- భారీ నష్టాల ముగింపు!

ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతల నేపథ్యంలో బలహీనంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా నేలచూపులకే పరిమితమయ్యాయి. చివరి గంటన్నరలో అమ్మకాలు ఊపందుకోవడంతో చివరికి భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 304 పాయింట్లు పతనమై 34,347 వద్ద నిలవగా.. నిఫ్టీ 107 పాయింట్లు కోల్పోయి 10,429 వద్ద స్థిరపడింది. మంగళవారం అమెరికా మార్కెట్లు నష్టపోగా.. ఆసియా, యూరప్‌ మార్కెట్లు సైతం తిరోగమన పథం పట్టడంతో దేశీయంగానూ సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు చెప్పారు. దీనికితోడు రూపాయి ఏడాదిన్నర కనిష్టం 68.28ను తాకడం కూడా ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైనట్లు తెలియజేశారు.
పీఎస్‌యూ బ్యాంక్స్‌ ఎదురీత
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ దాదాపు 3 శాతం జంప్‌చేయడం ద్వారా ఎదురీదాయి. మిగిలిన అన్ని రంగాలూ నష్టపోగా.. మెటల్స్‌ అత్యధికంగా దాదాపు 4 శాతం పతనమైంది. ఈ బాటలో రియల్టీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో 1-0.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌పీసీఎల్‌, వేదాంతా, టాటా స్టీల్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, ఐవోసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇండస్‌ఇండ్‌ 8-3 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు ఎస్‌బీఐ, సిప్లా, టెక్‌ మహీంద్రా, యూపీఎల్‌, ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ, గ్రాసిమ్‌, ఐబీ హౌసింగ్‌, టాటా మోటార్స్‌, టైటన్‌ 4-0.5 శాతం మధ్య ఎగశాయి. 
చిన్న షేర్లు వీక్‌
మార్కెట్ల పతనంకారణంగా చిన్న షేర్లు బలహీనపడ్డాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.25 శాతం స్థాయిలో నీరసించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1531 షేర్లు నష్టపోగా.. 1127 లాభపడ్డాయి.
ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1651 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించారు. అయితే ఇందుకు ధీటుగా దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 1497 కోట్లను ఇన్వెస్ట్‌  చేశాయి. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 496 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ రూ. 1190 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.Most Popular