చమురు షేర్లకు క్యూ4 ఫలితాల సెగ!

చమురు షేర్లకు క్యూ4 ఫలితాల సెగ!

గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(హెచ్‌పీసీఎల్‌), ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) కౌంటర్లు ఇన్వెస్టర్ల అమ్మకాలతో డీలాపడ్డాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో హెచ్‌పీసీఎల్‌ షేరు 8 శాతంపైగా కుప్పకూలి రూ. 287 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 284 దిగువన 52 వారాల కనిష్టాన్ని తాకింది. ఇక ఐవోసీ సైతం 4.2 శాతం పతనమై రూ. 154 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 153 దిగువన ఏడాది కనిష్టానికి చేరింది. 
హెచ్‌పీసీఎల్‌
క్యూ4(జనవరి-మార్చి)లో హెచ్‌పీసీఎల్‌ నికర లాభం 4 శాతం క్షీణించి రూ. 1748 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 13 శాతంపైగా పెరిగి రూ. 59,184 కోట్లకు చేరింది. 
ఐవోసీ
క్యూ4లో ఐవోసీ నికర లాభం 40 శాతం జంప్‌చేసి రూ. 5218 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 10 శాతం ఎగసి రూ. 1,36,981 కోట్లకు చేరింది. 
ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు నాలుగేళ్ల గరిష్టాల వద్దే కొనసాగుతుండటం, డాలరుతో మారకంలో రూపాయి ఏడాదిన్నర కనిష్టం 68 దిగువకు చేరడం వంటి అంశాలు పెట్రో ఉత్పత్తుల మార్కెటింగ్‌ కంపెనీల షేర్లను దెబ్బతీస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.Most Popular