దిగిరానున్న పెట్రోల్‌ ధరలు

దిగిరానున్న పెట్రోల్‌ ధరలు

గత కొన్నిరోజులుగా పెరుగుతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో బెంబెలెత్తుతోన్న ప్రజలకు శుభవార్త. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు రూ.2-4 తగ్గే అవకాశాలున్నాయి. ఇప్పటికే దీనిపై కసరత్తు జరిగినప్పటికీ  తుది నిర్ణయాన్ని కేంద్రం ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇవాళ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో సమావేశం కానున్నారు. అంతర్జాతీయంగా పెరుగుతోన్న క్రూడాయిల్‌ ధరలకు అనుగుణంగా గత కొంతకాలంగా ధరలు పైపైకి వెళ్తుండడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. తాత్కాలిక చర్యల్లో భాగంగా ధరల పెరుగుదలకు బ్రేక్‌ వేయనున్నట్టు సీనియర్‌ అధికార వర్గాలు తెలిపాయి. 

ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం ఒక లీటర్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని రూ.1 తగ్గిస్తే రూ.130-140 బిలియన్ల ఆదాయాన్ని కేంద్రం కోల్పోనుంది. రూ.2 తగ్గిస్తే రూ.260-280 బిలియన్లు, రూ.4 తగ్గిస్తే రూ.520-560 బిలియన్ల ఆదాయంలో కోత పడనుంది. బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్‌, డీజిల్‌పై సుంకం ద్వారా రూ.2.43 ట్రిలియన్ల ఆదాయం వస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఇక ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో మంగళవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.76.87, డీజిల్‌ రూ.68.08గా ఉంది. ముంబాయి మార్కెట్లో లీటర్‌ పెట్రోల్‌ రూ.84.70, డీజిల్‌ రూ.72.48గా ఉంది. Most Popular