ఇండోస్టార్‌ కేపిటల్‌ లాభాల లిస్టింగ్‌!

ఇండోస్టార్‌ కేపిటల్‌ లాభాల లిస్టింగ్‌!

బ్యాంకింగేతర ఫైనాన్స్‌ సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ) ఇండోస్టార్‌ కేపిటల్‌ ఫైనాన్స్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో దాదాపు 5 శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 572 కాగా.. బీఎస్‌ఈలో రూ. 28 లాభంతో రూ. 600 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం 3.7 శాతం బలపడి రూ. 593 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 606 వద్ద గరిష్టాన్నీ, రూ. 591 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఈ నెల రెండో వారంలో చేపట్టిన ఐపీవోకు దాదాపు 7 రెట్లు అధికంగా స్పందన లభించగా... తద్వారా కంపెనీ రూ. 1844 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే.
యాంకర్‌ నిధులు
ఇండోస్టార్‌ కేపిటల్‌ ఇష్యూకి ముందురోజు యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమీకరించింది. 24 యాంకర్‌ సంస్థలకు 96.7 లక్షల షేర్లను కేటాయించింది. షేరుకి రూ. 572 ధరలో వాటాను కేటాయించడం ద్వారా రూ. 553 కోట్లను సమకూర్చుకుంది. ఆఫర్‌లో భాగంగా రూ.700 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయడంతో పాటు, ప్రస్తుత వాటాదారులకు చెందిన 30 శాతం వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లను సైతం విక్రయానికి పెట్టింది. కాగా.. ఇన్వెస్ట్‌ చేసిన యాంకర్‌ సంస్థలలో ఎస్‌బీఐ ఎంఎఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఎంఎఫ్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తదితరాలున్నాయి.Most Popular