ఇండోస్టార్‌ కేపిటల్‌ లిస్టింగ్‌ సోమవారం!

ఇండోస్టార్‌ కేపిటల్‌ లిస్టింగ్‌ సోమవారం!

ఈ నెల రెండో వారంలో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టిన బ్యాంకింగేతర ఫైనాన్స్‌ సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ) ఇండోస్టార్‌ కేపిటల్‌ ఫైనాన్స్‌ సోమవారం(21న) స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. రూ. 572 ధరలో చేపట్టిన ఇష్యూ దాదాపు 7 రెట్లు అధికంగా స్పందన లభించగా... తద్వారా కంపెనీ రూ. 1844 కోట్లను సమీకరించింది.  
బిడ్స్‌ తీరిదీ
ఐపీవోలో భాగంగా ఇండోస్టార్‌ కేపిటల్‌ 2.25 కోట్ల షేర్లకుపైగా ఆఫర్ చేయగా.. 15.34 కోట్ల షేర్ల కోసం బిడ్స్‌ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్‌) కోటాలో 16 రెట్లు అధికంగా బిడ్స్‌ లభించాయి. సంపన్న వర్గాల నుంచి 7 రెట్లు దరఖాస్తులు లభించగా.. రిటైల్‌ ఇన్వెస్టర్లు 1.3 రెట్లు అధికంగా స్పందించారు. 
యాంకర్‌ నిధులు
ఇండోస్టార్‌ కేపిటల్‌ ఇష్యూకి ముందురోజు యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమీకరించింది. 24 యాంకర్‌ సంస్థలకు 96.7 లక్షల షేర్లను కేటాయించింది. షేరుకి రూ. 572 ధరలో వాటాను కేటాయించడం ద్వారా రూ. 553 కోట్లను సమకూర్చుకుంది. ఆఫర్‌లో భాగంగా రూ.700 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయడంతో పాటు, ప్రస్తుత వాటాదారులకు చెందిన 30 శాతం వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లను సైతం విక్రయానికి పెట్టింది. కాగా.. ఇన్వెస్ట్‌ చేసిన యాంకర్‌ సంస్థలలో ఎస్‌బీఐ ఎంఎఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఎంఎఫ్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తదితరాలున్నాయి.



Most Popular