బాబోయ్‌... చమురు మండుతోంది!

బాబోయ్‌... చమురు మండుతోంది!

అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు మంట పుట్టిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 0.15 శాతం బలపడి 79.39 డాలర్లకు చేరింది. న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ సైతం 0.3 శాతం పెరిగి 71.72 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఫలితంగా చమురు ధరలు 2014 నవంబర్‌నాటి స్థాయిలను తాకాయి. అమెరికాలో ఇంధన నిల్వలు తగ్గడంతో చమురు ధరలు మరింత బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
కారణాలేంటంటే?
గత వారం అమెరికాలో చమురు నిల్వలు 1.4 మిలియన్‌ బ్యారళ్లమేర క్షీణించినట్లు ఆ దేశ ఇంధన శాఖ తాజాగా వెల్లడించింది. ఈ బాటలో గ్యాసోలిన్‌ స్టాక్‌పైల్స్‌ సైతం 3.79 మిలియన్లు తగ్గినట్లు తెలియజేసింది. మధ్యప్రాచ్యంలో చమురు సరఫరాలకు కీలకమైన ఇరాన్‌తో మూడేళ్ల క్రితం కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని అమెరికా రద్దు చేసుకోవడంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. అణు ఒప్పందం రద్దుతోపాటు ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో చమురు ధరలు మండుతున్నాయి. వెనిజులా చమురు సరఫరాలు సైతం తగ్గడం దీనికి మరోకారణంగా నిలుస్తోంది. ఇప్పటికే ఒపెక్‌ దేశాల ఉత్పత్తి కోత కారణంగా చమురు సరఫరాలు తగ్గి ధరలు పుంజుకున్న విషయం విదితమే. 



Most Popular