నష్టాల మార్కెట్లోనూ గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ షేర్ల మెరుపు!

నష్టాల మార్కెట్లోనూ గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ షేర్ల మెరుపు!

దాదాపు ఏడాది కాలంగా ర్యాలీ బాటలో సాగుతున్న గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ తయారీ షేర్లు మరోసారి దూకుడు చూపుతున్నాయి. నష్టాల మార్కెట్లోనూ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో హెచ్‌ఈజీ లిమిటెడ్‌ 5.2 శాతం జంప్‌చేసి రూ. 3,446కు చేరింది. తొలుత ఒక దశలో రూ. 3,528 వద్ద సరికొత్త గరిష్టాన్ని సైతం అందుకుంది. ఈ బాటలో గ్రాఫైట్‌ ఇండియా షేరు 2.4 శాతం ఎగసి రూ. 767 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 775 వరకూ జంప్‌చేసింది. 
ఫలితాల ఎఫెక్ట్‌
గత కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లలో గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడటంతో దేశీ కంపెనీలు లబ్ది పొందుతూ వచ్చాయి. ప్రధానంగా చైనాలో పలు గ్రాఫైట్‌ తయారీ కంపెనీలు మూసివేయడంతో దేశీ కంపెనీల ప్రొడక్టులకు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా ధరలు పెరిగి కంపెనీల లాభదాయకత ఊపందుకుంది. వెరసి హెచ్‌ఈజీ, గ్రాఫైట్‌ ఇండియా ప్రోత్సాహకర ఫలితాలు సాధిస్తూ వస్తున్నాయి. 
రూ. 80 డివిడెండ్‌
క్యూ4(జనవరి-మార్చి)లో హెచ్‌ఈజీ రూ. 634 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2016-17 క్యూ4లో రూ. 3.4 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం ఐదు రెట్లు ఎగసి రూ. 1292 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 80 డివిడెండ్‌ చెల్లించింది. తొలుత రూ. 30, తదుపరి రూ. 50 చొప్పున డివిడెండ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 
గ్రాఫైట్‌ ఇండియా సైతం క్యూ4లో రూ. 454 కోట్ల నికర లాభం సాధించింది. అంతక్రితం క్యూ4లో రూ. 62 కోట్ల లాభం మాత్రమే ఆర్జించింది. నికర అమ్మకాలు సైతం మూడురెట్లు జంప్‌చేసి రూ. 1212 కోట్లకు చేరింది.Most Popular