ఆర్‌బీఐ ఎఫెక్ట్‌- కోలుకున్న రూపాయి! 

ఆర్‌బీఐ ఎఫెక్ట్‌- కోలుకున్న రూపాయి! 

ఇటీవల నేలచూపులకే పరిమితమవుతున్న దేశీ కరెన్సీ ఎట్టకేలకు కోలుకుంది. డాలరుతో మారకంలో తాజాగా 28 పైసలు(0.4 శాతం) బలపడి 67.78కు చేరింది. రూపాయి పతనాన్ని అడ్డుకునే బాటలో రిజర్వ్‌ బ్యాంక్‌ నేటి ట్రేడింగ్‌లో 30-40 కోట్ల డాలర్లను విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 7 పైసలు బలహీనపడి 68.14 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. రూపాయి మంగళవారం ఏకంగా 56 పైసలు పతనమై 68.07 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ఇది 16 నెలల కనిష్టంకాగా... ఇంతక్రితం 2017 జనవరిలో మాత్రమే రూపాయి ఈ స్థాయిలో ట్రేడయ్యింది. 
ట్రెజరీ ఈల్డ్స్‌ హైజంప్‌
ఏప్రిల్‌ నెలకు అమెరికా రిటైల్‌ విక్రయాలు 0.3 శాతం పెరగడంతో 10 ఏళ్ల కాలపరిమితిగల ట్రెజరీ ఈల్డ్స్‌ ఏకంగా 3.1 శాతానికి చేరాయి. ఇది ఏడేళ్ల గరిష్టంకాగా.. మరోపక్క ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 93.26కు బలపడింది. జూన్‌ సమీక్షలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపును చేపట్టవచ్చన్న అంచనాలకుతోడు దేశీయంగా కర్నాటకలో రాజకీయ అనిశ్చితి రూపాయిని దెబ్బతీసినట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. Most Popular