వన్నె తగ్గిన పసిడి- 2018 కనిష్టానికి!

వన్నె తగ్గిన పసిడి- 2018 కనిష్టానికి!

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఐదు నెలల కనిష్టానికి చేరింది. మంగళవారం ఒక దశలో ఔన్స్‌(31.1 గ్రాములు) 1288 డాలర్లకు పతనమైంది. 2017 డిసెంబర్‌ తరువాత ఇది కనిష్టంకాగా.. ప్రస్తుతం కాస్త కోలుకుంది. న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ బంగారం 0.2 శాతం(3 డాలర్లు) పుంజుకుని 1293 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో వెండి సైతం ఔన్స్‌ 0.15 శాతం బలపడి 16.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 
కారణాలున్నాయ్‌..
ఏప్రిల్‌ నెలకు అమెరికా రిటైల్‌ విక్రయాలు జోరందుకోవడంతో 2018 రెండో క్వార్టర్‌లో వినియోగం ఊపందుకున్న అంచనాలు బలపడ్డాయి. దీంతో  ఫెడరల్‌ రిజర్వ్‌ జూన్‌ 13న నిర్వహించనున్న పాలసీ సమావేశాలలో వడ్డీ రేట్ల పెంపును చేపట్టేందుకు వీలు చిక్కినట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇది ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌కు బూస్ట్‌నివ్వగా 10 ఏళ్ల కాలపరిమితిగల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్‌ ఏకంగా ఏడేళ్ల గరిష్టానికి చేరాయి. దాదాపు 3.1 శాతానికి ఎగశాయి. ఇంతక్రితం 2011 జూలైలో మాత్రమే ఈల్డ్స్‌ ఈ స్థాయికి చేరాయి. ఇక డాలరు ఇండెక్స్‌ తాజాగా 93.26కు బలపడింది. దీంతో ట్రేడర్లు పసిడిలో అమ్మకాలకు దిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. సంక్షోభ పరిస్థితుల్లో మాత్రమే రక్షణాత్మక పెట్టుబడిగా పసిడికి డిమాండ్‌ పుడుతుందని.. వడ్డీ రేట్లు పెరిగితే..  అధిక రిటర్నులు లభించే బాండ్లవైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతారని తెలియజేశారు. Most Popular